డిసెంబర్ క్వార్టర్లో 4.7% వృద్ధి | Q3 GDP grows at 4.7% versus 4.8% in Q2 | Sakshi
Sakshi News home page

డిసెంబర్ క్వార్టర్లో 4.7% వృద్ధి

Published Sat, Mar 1 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

డిసెంబర్ క్వార్టర్లో 4.7% వృద్ధి

డిసెంబర్ క్వార్టర్లో 4.7% వృద్ధి

న్యూఢిల్లీ: వ్యవసాయ, సేవారంగాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ 4.7 శాతం వృద్ధిచెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 4.4 శాతమని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ - డిసెంబర్) వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధి 4.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్ - జూన్)లో 4.4 శాతం, ద్వితీయ త్రైమాసికం(జూలై - సెప్టెంబర్)లో 4.8 శాతం చొప్పున స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిచెందింది.

 డిసెంబరుతో ముగిసిన క్వార్టర్లో వ్యవసాయ రంగం 3.6 శాతం (అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 0.8 శాతం) అభివృద్ధి సాధించింది. ఇదేకాలంలో తయారీ రంగం 1.9 శాతం క్షీణించగా అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో 2.5 శాతం వృద్ధిచెందింది. డిసెంబరుతో ముగిసిన 9 నెలల్లో ఈ రంగం 0.7 శాతం క్షీణించింది. డిసెంబర్ క్వార్టర్లో విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరాలు 5 శాతం పెరగ్గా అంతకుముందు ఏడాది ఇదేకాలంలో వృద్ధి రేటు 2.6 శాతంగా ఉంది. ఇదేకాలంలో నిర్మాణ రంగం 0.6 శాతం (అంతకు ముందు ఏడాది 1 శాతం) వృద్ధి నమోదుచేసింది. ఏప్రిల్ - డిసెంబర్ మధ్యకాలంలో ఈ రంగం 2.5 శాతం విస్తరించింది.

 వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో వృద్ధి రేటు మందగించింది. 2012-13 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో 5.9 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2013-14 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో 4.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 9 నెలల్లో ఈ రంగం 4.1 శాతం వృద్ధిని తాజా పెట్టుబడులకు సూచీగా భావించే గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ సమీక్షాకాలంలో రూ.5 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉంది.
 
 మౌలిక రంగం అంతంతే
 న్యూఢిల్లీ: కీలకమైన మౌలిక పరిశ్రమల(కోర్ ఇన్‌ఫ్రా) ఉత్పాదకత మందగమనంలోనే కొనసాగుతోంది. ప్రధానంగా బొగ్గు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, సహజవాయువు రంగాల పేలవ పనితీరుతో ఈ ఏడాది జనవరిలో మౌలిక వృద్ధి రేటు 1.6 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి 8.3 శాతం కాగా, డిసెంబర్‌లో 2.1 శాతంగా నమోదైంది. కోర్ ఇన్‌ఫ్రాలో ఇంకా ఉక్కు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, ముడిచమురు(మొత్తం ఎనిమిది) పరిశ్రమలు ఉన్నాయి.

వీటికి పారిశ్రామికోత్పత్తి వృద్ధి సూచీ(ఐఐపీ)లో 38 శాతం వెయిటేజి ఉంది. కాగా, ఇప్పటికే తిరోగమనంలో ఉన్న పారిశ్రామికోత్పత్తిపై తాజా కోర్ ఇన్‌ఫ్రా మందగమనంతో మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. రికవరీ ఆశలపై నీళ్లుచల్లుతూ డిసెంబర్‌లో ఐఐపీ మైనస్ 0.6 శాతం కుంగిన సంగతి తెలిసిందే. జనవరిలో బొగ్గు ఉత్పాదకత మైనస్‌లోకి జారిపోయింది. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 0.7 శాతం క్షీణించింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత మైనస్ 4.5 శాతానికి పడిపోయింది. సహజ వాయువు విభాగం మైనస్ 5.2 శాతానికి కుంగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement