స్పీడ్‌లేని పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 2014 ఆగస్టులో నిరాశపరిచింది. 2013 ఆగస్టుతో పోల్చితే కేవలం 0.4 శాతం వృద్ధి నమోదయ్యింది. 2012 ఆగస్టుతో పోల్చి 2013 ఆగస్టులో కూడా ఇదే స్థాయిలో వృద్ధి నమోదుకావడం విశేషం. తాజా వృద్ధి రేటు ఐదు నెలల కనిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను విడుదల చేసింది. పటిష్ట సంస్కరణలతోనే పారిశ్రామిక రంగానికి, డిమాండ్‌కు పునరుత్తేజం సాధ్యమని, తక్షణం ఈ దిశలో కేంద్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు డిమాండ్ చేశాయి.
తయారీ, వినియోగ వస్తువుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనెస్) నమోదుకావడం మొత్తం సూచీపై ప్రతికూలత చూపింది. కాగా 2014 జూలైలో వృద్ధి 0.5 శాతమని తొలుత అంచనా వేసినప్పటికీ దీనిని సైతం 0.41 శాతంగా తగ్గించడం మరో నిరాశాపూరిత అంశం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలో (2014-15, ఏప్రిల్-ఆగస్టు) ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సైతం వృద్ధి రేటు ఇదే విధంగా ఉంది.
మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టులో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 1.4 శాతం క్షీణించింది. ఈ క్షీణత 2013 కన్నా తీవ్రంగా ఉండడం (-0.2 శాతం) విచారకరం.
ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి
ఆమోదిత ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి. బొగ్గు, మైనింగ్ రంగాల్లో పోటీ పూర్వక మార్కెట్ నెలకొనాలి. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల్లో విధాన ప్రకటనలు, కార్మిక సంస్కరణలు వృద్ధిని మెరుగు పరుస్తాయని భావిస్తున్నాం.
- చంద్రజిత్ బెనర్జీ, సెక్రటరీ జనరల్, సీఐఐ
‘తయారీ’కి కష్టకాలం పోలేదు
తయారీ రంగానికి కష్టకాలం తొలగిపోలేదన్న విషయాన్ని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇది చాలా విచారకరం. దీనితోపాటు వినియోగ వస్తువుల రంగం, క్యాపిటల్ గూడ్స్‌ప్రతికూలతలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా రంగాల స్పీడ్‌కు పటిష్ట సంస్కరణలు అవసరం.
- ఏ దిదార్ సింగ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ