Chandrajit Banerjee
-
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్.. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు. వివాదాల పరిష్కారంపై దృష్టి.. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
ప్రైవేటు కంపెనీల మాదిరే
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) సైతం ప్రైవేటు కంపెనీల మాదిరే పాలనా ప్రమాణాలను అనుసరించే విధంగా ఉండాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. సీవీసీ, కాగ్, సీబీఐ దర్యాప్తు వంటివి తరచుగా ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాల్లో అతి జాగ్రత్త లేదా నిర్ణయాలు నిలిచిపోవడానికి కారణమవుతున్నాయని, ఇలా కాకుండా చూసి, ప్రైవేటు సంస్థల మాదిరే పనిచేసే వాతావరణం కలి్పంచాలని పేర్కొంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడగలవని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఎలిఫెంట్:ఎన్హాన్సింగ్ కాంపిటీటివ్నెస్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలపై రూపొందించిన పరిశోధన నివేదికను విడుదల చేశారు. -
వచ్చే ఏడాదీ ఆర్థిక వృద్ధి జోరు– సీఐఐ
న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో క్రమేపీ అడ్డంకులు తొలగడం, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగడం, రుణ సమీకరణ ప్రత్యేకించి సర్వీసుల రంగంలో 24 శాతానికి పెంచుకోవడం వంటి అంశాలు బలమైన ఆర్థికాభివృద్ధికి బాట వేస్తున్నాయని ఆయన వివరించారు. 2018లో పలు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలుకావడం, చమురు ధరలు పెరగడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠినతర ద్రవ్య విధానం వంటి ప్రతికూలాంశాల నడుమ భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిచెందిందని సీఐఐ గుర్తుచేసింది. 2019లో జీడీపీ వృద్ధి వేగవంతంకావడానికి ఏడు కీలక విధాన చర్యల్ని సీఐఐ సూచించింది. ఇంధనం, రియల్ ఎస్టేట్, విద్యుత్, ఆల్కహాల్ విభాగాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యతను పెంచడం, పీసీఏ పరిధిలో వున్న బ్యాంకులపై నియంత్రణలను సరళీకరించడంతో పాటు మ్యూచువల్‌ఫండ్స్‌తో సహా ఆర్థిక సంస్థలకు అత్యవసర నిధుల్ని అందుబాటులో ఉంచాలని సీఐఐ కోరింది. ల్యాండ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయడం, రాష్ట్రాల్లో ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థల్ని ఏర్పాటుచేయడం వంటివి జరగాలని సీఐఐ ఆకాంక్షించింది. -
బాగుంది... కానీ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–7.5 శాతం మేర ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను కార్పొరేట్లు స్వాగతించారు. నిలకడైన ఆర్థిక వృద్ధి సాధనకోసం మానవ వనరుల్ని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ‘రాబోయే సంవత్సరంలో వృద్ధి వేగం మెరుగుపడటానికి, ఆ తర్వాత నుంచి మరింతగా పుంజుకోవడానికి అవసరమైన కొత్త ఐడియాలను సర్వే ప్రస్తావించింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళల ఉపాధితో పాటు విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన మానవ వనరులను, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడంపై మధ్య కాలికంగా మరింత దృష్టి సారించాలని సర్వేలో చేసిన సిఫార్సులు సహేతుకమైనవేనని ఆయన చెప్పారు. వీటిలో కొన్నింటినైనా బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోగలరని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్పీఏల పరిష్కారం కీలకం: అసోచామ్ మొండిబాకీల సమస్య పరిష్కారమయ్యే దాకా అధిక వృద్ధి సాధ్యపడకపోవచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా అభిప్రాయపడ్డారు. నిరర్ధక ఆస్తులపై పర్యవేక్షణ పెంచడం, బ్యాంకులకు సాధ్యమైనంత త్వరగా అదనపు మూలధనం సమకూర్చడం చేయాలన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు పెరుగుతుండటం వంటి ఆందోళనకర అంశాలను సర్వే ప్రస్తావించింది. ఉపాధి కల్పన, వ్యవసాయం, విద్యపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచించింది‘ అని సందీప్ తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడిపై మరింతగా దృష్టి సారించాలని, సంస్కరణల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారాయన. సేవల రంగంలో ఉద్యోగాలు పెరగాలి: డెలాయిట్ ఆటోమేషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో కాయకష్టం అవసరమయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోందని డెలాయిట్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అనీస్ చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో సేవల రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పన జరగాల్సి ఉంటుందన్నారు. తయారీ రంగం వృద్ధి చెందుతుండటం సానుకూలాంశమని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (ఇన్ఫ్రా విభాగం) మనీష్ అగర్వాల్ పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ పెరగడంతో పాటు సిమెంటు, ఉక్కు మొదలైన వాటి వినియోగం పెరుగుదలతో పారిశ్రామికోత్పత్తి మరింతగా మెరుగుపడగలదన్నారు. 2018–19లో వృద్ధి మెరుగుపడటం ఖాయమే అయినప్పటికీ.. ఇది సర్వేలో అంచనా వేస్తున్న శ్రేణిలో దిగువ స్థాయిలోనే ఉండొచ్చని (7 శాతం) ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. దేశ, విదేశీ పరిస్థితుల కారణంగా వృద్ధి ఎటువైపైనా మొగ్గు చూపవచ్చన్నారు. -
స్పీడ్లేని పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 2014 ఆగస్టులో నిరాశపరిచింది. 2013 ఆగస్టుతో పోల్చితే కేవలం 0.4 శాతం వృద్ధి నమోదయ్యింది. 2012 ఆగస్టుతో పోల్చి 2013 ఆగస్టులో కూడా ఇదే స్థాయిలో వృద్ధి నమోదుకావడం విశేషం. తాజా వృద్ధి రేటు ఐదు నెలల కనిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను విడుదల చేసింది. పటిష్ట సంస్కరణలతోనే పారిశ్రామిక రంగానికి, డిమాండ్‌కు పునరుత్తేజం సాధ్యమని, తక్షణం ఈ దిశలో కేంద్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు డిమాండ్ చేశాయి. తయారీ, వినియోగ వస్తువుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనెస్) నమోదుకావడం మొత్తం సూచీపై ప్రతికూలత చూపింది. కాగా 2014 జూలైలో వృద్ధి 0.5 శాతమని తొలుత అంచనా వేసినప్పటికీ దీనిని సైతం 0.41 శాతంగా తగ్గించడం మరో నిరాశాపూరిత అంశం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలో (2014-15, ఏప్రిల్-ఆగస్టు) ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సైతం వృద్ధి రేటు ఇదే విధంగా ఉంది. మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టులో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 1.4 శాతం క్షీణించింది. ఈ క్షీణత 2013 కన్నా తీవ్రంగా ఉండడం (-0.2 శాతం) విచారకరం. ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి ఆమోదిత ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి. బొగ్గు, మైనింగ్ రంగాల్లో పోటీ పూర్వక మార్కెట్ నెలకొనాలి. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల్లో విధాన ప్రకటనలు, కార్మిక సంస్కరణలు వృద్ధిని మెరుగు పరుస్తాయని భావిస్తున్నాం. - చంద్రజిత్ బెనర్జీ, సెక్రటరీ జనరల్, సీఐఐ ‘తయారీ’కి కష్టకాలం పోలేదు తయారీ రంగానికి కష్టకాలం తొలగిపోలేదన్న విషయాన్ని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇది చాలా విచారకరం. దీనితోపాటు వినియోగ వస్తువుల రంగం, క్యాపిటల్ గూడ్స్ప్రతికూలతలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా రంగాల స్పీడ్‌కు పటిష్ట సంస్కరణలు అవసరం. - ఏ దిదార్ సింగ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ