
సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
జీఎస్‌టీ అమలులో క్రమేపీ అడ్డంకులు తొలగడం, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగడం, రుణ సమీకరణ ప్రత్యేకించి సర్వీసుల రంగంలో 24 శాతానికి పెంచుకోవడం వంటి అంశాలు బలమైన ఆర్థికాభివృద్ధికి బాట వేస్తున్నాయని ఆయన వివరించారు. 2018లో పలు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలుకావడం, చమురు ధరలు పెరగడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠినతర ద్రవ్య విధానం వంటి ప్రతికూలాంశాల నడుమ భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిచెందిందని సీఐఐ గుర్తుచేసింది.
2019లో జీడీపీ వృద్ధి వేగవంతంకావడానికి ఏడు కీలక విధాన చర్యల్ని సీఐఐ సూచించింది. ఇంధనం, రియల్ ఎస్టేట్, విద్యుత్, ఆల్కహాల్ విభాగాలను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యతను పెంచడం, పీసీఏ పరిధిలో వున్న బ్యాంకులపై నియంత్రణలను సరళీకరించడంతో పాటు మ్యూచువల్‌ఫండ్స్‌తో సహా ఆర్థిక సంస్థలకు అత్యవసర నిధుల్ని అందుబాటులో ఉంచాలని సీఐఐ కోరింది. ల్యాండ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయడం, రాష్ట్రాల్లో ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థల్ని ఏర్పాటుచేయడం వంటివి జరగాలని సీఐఐ ఆకాంక్షించింది.