దేశ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్‌ల దన్ను
కొత్త యూనికార్న్‌లపై సీఐఐ నివేదిక
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించే స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది.
బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్‌ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది.
శతకాన్ని దాటాయ్
నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్‌ను యూనికార్న్‌లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్‌ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్‌ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment