
పరిశ్రమల నత్తనడక...
♦ మార్చిలో కేవలం 0.1 శాతం వృద్ధి
♦ తయారీ, మైనింగ్ ఉత్పత్తుల క్షీణత
♦ గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 2.4 శాతం
న్యూఢిల్లీ: పరిశ్రమల ఉత్పత్తి గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చి) నత్తనడకన సాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 2.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014-15లో ఈ రేటు 2.8 శాతం. గురువారం మార్చి గణాంకాలు వెళ్లడి కావడంతో... ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరు స్పష్టమైంది. ఒక్క మార్చిని చూస్తే... వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదయ్యింది. మూడు నెలలుగా క్షీణతలో ఉన్న వృద్ధి రేటు- ఫిబ్రవరిలో 2 శాతం వృద్ధికి మారి కొంత ఉత్సాహాన్ని ఇచ్చినా... మరుసటి నెలే ఈ ఉత్సాహం నీరుగారిపోయేలా ఫలితం నమోదు కావడం గమనార్హం.
మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంతోపాటు మైనింగ్, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగాలు మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. 2015 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. మార్చిలో కీలక రంగాల పనితీరును వేర్వేరుగా చూస్తే...
తయారీ: ఈ రంగంలో అసలు వృద్ధిరేటు నమోదుకాలేదు. 2015 మార్చిలో 2.7% ఉన్న వృద్ధిరేటు 2016లో మార్చిలో అసలు వృద్ధి లేకపోగా -1.2 శాతం క్షీణతలోకి జారిపోయింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది.
మైనింగ్: నెలలో ఈ రంగం కూడా 1.2 శాతం నుంచి వృద్ధి నుంచి -0.1 శాతం క్షీణతలోకి పడింది. అయితే వార్షికంగా వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 2.2 శాతానికి ఎగసింది.
విద్యుత్: మార్చిలో వృద్ధిరేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. అయితే వార్షికంగా మాత్రం ఈ రేటు 8.4 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది.
కేపిటల్ గూడ్స్: ఈ రంగం 2015 మార్చిలో 9.1 శాతం వృద్ధి సాధిస్తే.. 2016 మార్చిలో 15.4 శాతానికి పడింది. వార్షికంగాసైతం వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది.
వినియోగ వస్తువులు: ఈ రంగం కొంచెం ఊరటనిచ్చింది. -0.6 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. వార్షికంగా వృద్ధి రేటు 3.5 శాతం నుంచి 3 శాతానికి పడింది.
మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం పైకి..
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో మళ్లీ మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. 5.39 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 5.69%గా ఉన్న ఈ రేటు అటు తర్వాత రెండు నెలల్లో 5.18%, 4.83%గా నమోదయ్యింది. ఆహార ధరలు పెరగడం తాజా సమీక్ష నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. నిత్యావసరారాల్లో పప్పుదినుసుల ధరలు భారీగా 34 శాతం ఎగశాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10% పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినా, ఆర్‌బీఐ తదుపరి రేట్ల కోతకు అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.