న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తిపై మే నెల్లో ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 29.3 శాతం పురోగమించింది. గణాంకాల ప్రకారం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సూచీలు మహమ్మారి ముందస్తు స్థాయికన్నా ఇంకా దిగువనే ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్.
ఇక్కడ 2020 మే నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్‌డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 90.2 పాయింట్లకు పడిపోయింది. 2021 మేలో (తాజా సమీక్షా నెల్లో 116.6 పాయింట్లకు ఎగసింది. అంటే పెరుగుదల 29.3 శాతం. ఇక కరోనా ముందు 2019 మే నెల్లో సూచీ 135. 4 పాయింట్లుగా ఉంది. అంటే 2019 మే ఐఐపీతో పోల్చితే 2020 మేలో సూచీ వృద్ధి లేకపోగా 33.5 శాతం క్షీణించిందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన కీలక విభాగాల లెక్కల తీరు క్లుప్తంగా..
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం కలిగిన ఈ విభాగం వృద్ధి 34.5 శాతం. 2020లో 37.8 శాతం క్షీణత నమోదయ్యింది.
► మైనింగ్: వృద్ధి 23.3 శాతం (2020 మేలో 20.4 శాతం క్షీణత)
► విద్యుత్: 2020 మేలో 14.9 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో 7.5 శాతం పురోగతి సాధించింది.
► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులు, భారీ యంత్ర సామగ్రి ఉత్పత్తికి సంకేతమైన ఈ విభాగంలో 65.9 శాతం క్షీణత.. 2021 మేలో 85.3 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది.
► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి ఈ ఉత్పత్తుల విభాగం 70.3 శాతం క్షీణత నుంచి బయటపడి 98.2 శాతం పురోగమించింది
► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, ఫేస్ క్రీమ్స్, పౌడర్ల వంటి ఉత్పత్తులకు సంబంధించిన ఈ ఎఫ్‌ఎంసీజీ విభాగం 9.7% క్షీణత నుంచి బయటపడి స్వల్పంగా 0.8% పెరిగింది.
2020 మార్చి నుంచీ ఒడిదుడుకులు..
కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్‌లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (–0.6 శాతం)జారిపోయింది.
ధరలు తగ్గినా.. ఆర్‌బీఐ లక్ష్యానికి ఎగువనే..!
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ముందు నెల మేతో పోల్చితే స్వల్పంగా ఉపశమించింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లక్ష్యంకన్నా ఎగువన 6.26 శాతంగా నమోదయ్యింది. మే నెల్లో ఇది 6.3%. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గణాంకా ప్రకారం వార్షికంగా చూస్తే (2020 జూన్‌తో పోల్చి) ఆహార ద్రవ్యోల్బణం 5.15%గా ఉంది (మేలో 5.01%) ఇక చమురు, వెన్న పదార్థాల ధరలు ఏకంగా 34.78% ఎగశాయి. పండ్ల ధరలు 11.82 శాతం పెరిగాయి.
అయితే కూరగాయల ధరలు మాత్రం 0.7% తగ్గాయి. విద్యుత్, లైట్ విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 12.68%. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా 6.16%, 6.37%గా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌ఓ సిబ్బంది వ్యక్తిగతంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణ మండీల నుంచి వారంవారీగా గణాంకాల సేకరించి నెలవారీ ద్రవ్యోల్బణాన్ని మదింపుచేస్తారు. ఆర్‌బీఐ కీలక పాలసీ రేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి పరపతి విధాన కమిటీ యథాతథంగా 4%గా కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment