స్వల్పంగా పెరిగిన సూచీలు
ముంబై: రెండు రోజుల పతనానికి అడ్డుకట్ట వేస్తూ అక్టోబర్ నెల మొదటి రోజు సూచీలు లాభాలతో ముగిశాయి. ఆటో రంగ అమ్మకాలు బాగుండటానికి తోడు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొస్తుండటంతో ఆటో, రియల్టీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు సూచీలను పైకి తీసుకెళ్ళాయి. దీంతో సోమవారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 19,517 వద్ద ముగియగా, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 5,780 వద్ద క్లోజయ్యింది.
వ్యయ నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో 16 సంవత్సరాల తర్వాత అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఒకానొక దశలో మార్కెట్లు పతనమైనా ఆ తర్వాత వెనువెంటనే కోలుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ మూడు వారాల కనిష్ట స్థాయి 19,264 పాయింట్లకు పడిపోయినా, హెచ్‌డీఎఫీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్ షేర్లు మూడు శాతం పెరగ్గా, ఓఎన్‌జీసీ, సెసా గోవా, ఎన్‌టీపీసీ, టాటాపవర్ రెండు నుంచి నాలుగు శాతం నష్టపోయాయి. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.
12 నుంచి రోజువారి సర్క్యూట్ బ్రేకర్స్
ప్రస్తుతం మూడు నెలల ట్రేడింగ్ పరిమాణం ఆధారంగా నిర్ణయిస్తున్న సూచీల ట్రేడింగ్ హాల్ట్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అక్టోబర్ 11 నుంచి రోజువారీ ట్రేడింగ్ పరిమాణం ఆధారంగా నిర్ణయించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. అక్టోబర్ 11 వరకు సెన్సెక్స్ ఒక రోజులో 1,950 పాయింట్లు పెరిగినా లేక తగ్గినా ఒక గంట పాటు ట్రేడింగ్‌ను ఆపే విధంగా సర్క్యూట్ బ్రేకర్ అమలులో ఉంటుందని, ఆ తర్వాత నుంచి ఈ సర్క్యూట్ బ్రేకర్‌ను రోజువారీ నిర్ణయిస్తారని సెబీ మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అక్టోబర్ 11 వరకు 10 %, 15%, 20% సర్క్యూట్ బ్రేకర్స్‌ను సెప్టెంబర్ 30 నాటి మూడు నెలల ట్రేడింగ్ పరిమాణం పరంగా లెక్కించాలని సెబీ పేర్కొంది. దీని ప్రకారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఒంటి గంటలోపు సెన్సెక్స్ 10 శాతం అంటే 1,950 పాయింట్లు, నిఫ్టీ 570 పాయింట్లు నష్టపోయినా లేక పెరిగినా ఒక గంటపాటు ట్రేడింగ్‌ను ఆపేయడం జరుగుతుంది.
నేడు మార్కెట్లకు సెలవు
గాంధీజీ జయంతి సందర్భంగా బుధవారం అన్ని ఫైనాన్షియల్ మార్కెట్లతో పాటు బులియన్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. బీఎస్‌ఈ, సెన్సెక్స్, ఫారెక్స్ , కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లు అక్టోబర్ 2న పనిచేయవు.