వారం రోజుల కనిష్టం
ఉక్రెయిన్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి.సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 22,632 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 21 పాయింట్లు తగ్గి 6,761 వద్ద నిలిచింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు నీరసించాయి. ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు 1% చొప్పున నష్టపోగా, హెల్త్‌కేర్ దాదాపు 2% లాభపడింది.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టడంతో గడిచిన శుక్రవారం సైతం సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. విదేశీ సంకేతాలు, సార్వత్రిక ఎన్నికలపై ఆశావహ అంచనాలతో ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాపై ఆంక్షలు పెరిగే అవకాశముండటంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టపోయాయని, ఇది కూడా అమ్మకాలకు కారణమైందని వివరించారు.
సిప్లా 3% అప్
ఎఫ్‌ఐఐలు రూ. 77 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 370 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో గెయిల్, భెల్, ఎల్‌అండ్‌టీ, హీరోమోటో, టాటా మోటార్స్, హిందాల్కో, కోల్ ఇండియా 2-1.5% మధ్య నష్టపోగా, సిప్లా 3%పైగా ఎగసింది. ఈ బాటలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఎస్‌బీఐ 2-1% మధ్య పుంజుకున్నాయి. కాగా, మిడ్ క్యాప్ షేర్లకు డిమాండ్ కొనసాగింది. యునెటైడ్ ఫాస్ఫరస్, అడ్వాంటా, కిర్లోస్కర్ బ్రదర్స్, జేపీ ఇన్‌ఫ్రా, జైన్ ఇరిగేషన్, ఇండియాబుల్స్ హౌసింగ్, వోకార్డ్, నైవేలీ లిగ్నైట్, సింఫనీ, క్లారిస్ లైఫ్ తదితరాలు 20-6% మధ్య పురోగమించాయి. అయితే ఎతిహాద్ నుంచి ఓపెన్ ఆఫర్ ఉండదన్న వార్తలతో జెట్ ఎయిర్‌వేస్ 3% క్షీణించింది.