ఎల్‌అండ్‌టీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 69% జంప్‌చేసి రూ. 2,723 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 1,610 కోట్లను మాత్రమే ఆర్జించింది. మౌలిక సదుపాయాలు, భారీ ఇంజనీరింగ్ విభాగాల పనితీరు ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఇదే కాలంలో నికర అమ్మకాలు 10% పుంజుకుని రూ. 20,079 కోట్లకు ఎగశాయి. గతంలో రూ. 18,076 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ హైడ్రోకార్బన్‌కు 2013 ఏప్రిల్ నుంచి హైడ్రోకార్బన్ బిజినెస్‌ను బదిలీ చేసినందున ఫలితాలలో వీటిని కలపలేదని ఎల్‌అండ్‌టీ తెలిపింది.
కొత్త ప్రభుత్వంపై ఆశలు...
కేంద్రంలో మోడీ అధ్యక్షతన ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి అజెండా ఆశావహంగా ఉన్నదని, తద్వారా వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీకి కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలకు వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, స్పష్టమైన విధానాలు, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. భారీ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఆదాయం 47% ఎగసి రూ. 1,348 కోట్లకు చేరగా, ఇన్‌ఫ్రా విభాగం నుంచి రూ. 13,260 కోట్లు లభించింది. ఇది 17% వృద్ధి. ఆర్డర్‌బుక్ విలువ 13% పుంజుకుని రూ. 1,62,952 కోట్లకు చేరింది. దీనిలో విదేశీ ఆర్డర్ల వాటా 21%. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు యథాతథంగా రూ. 1,549 వద్ద ముగిసింది.