
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్‌లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం.
భారత్‌కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్‌లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment