న్యూఢిల్లీ: హోటల్ బుకింగుల స్టార్టప్ దిగ్గజం ఓయో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో సాఫ్ట్‌బ్యాంక్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హాలిడేస్(హెచ్‌కే) తదితరాలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. 2013లో ఏర్పాటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 71 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం!
నష్టాలలోనే...: కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతీ ఏడాది నష్టాలనే నమోదు చేస్తున్నట్లు ఒరావెల్ స్టేస్ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి సవాళ్లు విసరడంతో బిజినెస్ మరింత డీలాపడినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఓయోకు రూ. 3,944 కోట్ల నష్టాలు వాటిల్లగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో రూ. 13,123 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2018–19లో దాదాపు రూ. 2,365 కోట్ల నష్టం ప్రకటించింది. జూలైకల్లా కంపెనీ రుణ భారం రూ. 4,891 కోట్లకు చేరింది. ఐపీవో నిధుల్లో కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి దాఖలు చేసిన దరఖాస్తులో ఓయో తెలియజేసింది. ఓయోలో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వ్యక్తిగత హోదాలో 8.21 శాతం, హోల్డింగ్ కంపెనీ ఆర్‌ఏ హాస్పిటాలిటీ ద్వారా మరో 24.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ మరింత అధికంగా 46.62 శాతం వాటాను పొందింది.
నిధుల వినియోగం ఇలా
ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు రూ. 2,441 కోట్లను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఓయో వెల్లడించింది. మరో రూ. 2,900 కోట్లను కంపెనీ విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన పెట్టుబడులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.
కాగా.. ఇటీవల కొద్ది రోజులుగా యూనికార్న్ హోదా(బిలియన్ డాలర్ల విలువ) పొందిన పలు స్టార్టప్‌లు స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో లాభాలతో లిస్ట్‌కాగా.. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్, బ్యూటీ ప్రొడక్టుల ఆన్‌లైన్ రిటైలర్ నైకా, ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ సైతం పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. వివిధ చర్యల ద్వారా స్థూల లాభ మార్జిన్లను 2020లో నమోదైన 9.7 శాతం నుంచి 2021 మార్చికల్లా 33.2 శాతానికి మెరుగుపరచుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది.
చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
Comments
Please login to add a commentAdd a comment