మార్కెట్లు-ఈవారం
విదేశీ మదుపర్లు గతవారం పెద్దగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు చేయనందున సూచీలు నత్తనడకన సాగాయి. బీఎస్‌ఈ(BSE) వారం మొత్తానికి దాదాపు 650 పాయింట్లు లాభపడి 78700 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) ఇంచుమించు 200 పాయింట్లు పెరిగి 23813 పాయింట్ల దరిదాపుల్లో క్లోజయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో కేవలం 0.8 శాతం లాభపడ్డాయన్నమాట.
విదేశీ మదుపర్లు
డిసెంబర్ చివరి వారంలో విదేశీమదుపర్ల(FII) లావాదేవీలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం వీరు అధికశాతం ట్రేడింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికే మన మార్కెట్లో వీరి కొనుగోళ్లు బాగా పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే మన ఈక్విటీల్లో వీరి అమ్మకాలు 82 శాతానికి చేరాయి. నికర కొనుగోళ్లు కేవలం 18 శాతం స్థాయిలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వాస్తవానికి గతవారం షార్ట్‌కవరింగ్ లావాదేవీల రూపంలో కొనుగోళ్ల మద్దతు లభించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చోటుచేసుకోలేదు. పైగా గత శుక్రవారం ఆప్షన్స్ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే భారీగా అమ్మకాలు ఒత్తిళ్లు ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు మళ్లీ పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి అడుగుపెట్టేవరకు జోష్ తక్కువగానే ఉంటుంది. గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ.11,000 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.
ఈవారం అంచనాలు
ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. ఈ వారం నిఫ్టీకి 23650 పాయింట్లు తక్షణ మద్దతుగా కనిపిస్తోంది. ఆ స్థాయిని బ్రేక్ చేసిన పక్షంలో మాత్రమే 23500 దిగువకు వెళ్తుంది. అక్కడ మార్కెట్‌కు మద్దతు దొరికి సూచీలు బలంగా పుంజుకునే సూచనలు ఉన్నప్పటికీ అమ్మకాలు వెల్లువెత్తితే మాత్రం 23350 -23000 వరకు పతనం కొనసాగవచ్చు. అలాకాక ముందుకు కదిలితే 23940 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 24000 వద్ద ఉంది. దీన్నీదాటుకుని ముందుకెళ్తే 24200 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉన్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువస్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం ఉన్నప్పటికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇక బ్యాంకు నిఫ్టీ విషయానికొస్తే.. 51300 దిగువన కొనసాగితే మాత్రం 50500-50250 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే మొదటి దశలో 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. ఆపై 52500-52800 వరకు పరుగులు తీయొచ్చు.
ఇదీ చదవండి: తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు
సెక్టార్ల విషయానికొస్తే..
మిగతా రంగాలతో పోలిస్తే ఈవారం ఫార్మా రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. రూపాయి క్షీణత ఈ రంగానికి కలిసొచ్చే ప్రధానాంశంగా చెప్పవచ్చు. అలాగే ఐటీ షేర్లకూ రూపాయి క్షీణత సానుకూలమే అయినప్పటికీ, వచ్చే నెలారంభంలో వెలువడే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల ఫలితాలు ఈ రంగంలోని షేర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చు. యంత్ర పరికరాల రంగానికి సాధారణ స్థాయిలోనే మద్దతు లభిస్తుంది. ఈ షేర్లు పెరిగేది తక్కువే. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు బ్యాంకుల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఇన్వెస్టర్లు ఓ కన్నేయవచ్చు. టెలికాం, ఎఫ్ఎంసీజీ, లోహ , సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో కదలికలు స్వల్ప స్థాయికి పరిమితమవుతాయి. ఆటో మొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది.
-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment