ముంబై: కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను దేశీ క్యాపిటల్ మార్కెట్లు విశేషంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) విదేశీ పెట్టుబడుల రీత్యా మార్కెట్లు రికార్డులు సాధించే వీలుంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకూ చూస్తే ఎఫ్‌పీఐలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సాధనాలలో కలిపి ఏకంగా 33.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. డాలరుతో మారకంలో ప్రస్తుత రూపాయి విలువ(72.65) ప్రకారం వీటి విలువ రూ. 2.45 లక్షల కోట్లకుపైమాటే. ఇంతక్రితం 2014–15లో మాత్రమే ఎఫ్‌పీఐలు ఇంతకంటే అధికంగా అంటే 46 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడుల విలువ 592.5 బిలియన్ డాలర్లను తాకింది. వీటిలో ఈక్విటీ పెట్టుబడుల విలువ 537.4 బిలియన్ డాలర్లుకాగా.. రుణ సాధనాలలో 51.38 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. దేశీ దిగ్గజం కేర్ రేటింగ్స్ రూపొందించిన గణాంకాలివి.
ఫైనాన్షియల్ జోరు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు(హోల్డింగ్స్) అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో (191.3 బిలియన్ డాలర్లు) నమోదుకాగా.. సాఫ్ట్‌వేర్ 76 బిలియన్ డాలర్లను ఆకట్టుకుంది. ఆయిల్, గ్యాస్‌లో 50 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్స్, కాంపోనెంట్స్‌లో 27 బిలియన్ డాలర్లు, బయోటెక్నాలజీలో దాదాపు 23 బిలియన్ డాలర్లు, సావరిన్ డెట్‌లో 21.7 బిలియన్ డాలర్లు చొప్పున ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. వ్యక్తిగత ఉత్పత్తులు, క్యాపిటల్ గూడ్స్, ఆహారం, పానీయాలు, బీమా రంగాలు సైతం 20–13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందాయి. 10 ప్రధాన రంగాలు ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 78% వాటాను ఆక్రమిస్తున్నాయి.
డిసెంబర్‌లో..: ఈ ఏడాది లభించిన దాదాపు 34 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల్లో 8.4 బిలియన్ డాలర్లు ఒక్క డిసెంబర్‌లోనే లభించడం విశేషం! అయితే కేర్ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా నమోదయ్యాయి. 2019–20లో ఎఫ్‌పీఐలు నికరంగా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న విదేశాలలో యూఎస్ వాటా 34 శాతంకాగా.. మారిషస్ 11 శాతం, సింగపూర్ 8.8 శాతం, లగ్జెమ్‌బర్గ్ 8.6 శాతం, బ్రిటన్ 5.3 శాతం, ఐర్లాండ్ 4%, కెనడా 3.4 శాతం, జపాన్ 2.8 శాతం చొప్పున వాటాను ఆక్రమిస్తున్నాయి. నెదర్లాండ్స్, నార్వే సైతం 2.4% వాటాను కలిగి ఉన్నాయి.
ఎఫ్‌పీఐ పెట్టుబడులు.. భళా
Published Fri, Feb 19 2021 5:53 AM | Last Updated on Fri, Feb 19 2021 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment