
డాలర్–రూపాయి మారకం, చమురు ధరలు సైతం
ఈ వారం మార్కెట్ తీరుపై విశ్లేషకుల అంచనా
ఎఫ్‌పీఐల అమ్మకాలు.. రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ (క్యూ3) ముగియడంతో.. అంతర్జాతీయ అంశాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ తీరు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా అమ్మకాలు చేస్తుండడం, క్యూ3లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గత వారం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడం గమనార్హం. దీంతో నిఫ్టీ కీలకమైన 22800 మద్దతు స్థాయికి సమీపానికి మరోసారి వచ్చింది.
నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా ఎనిమిదో రోజూ (గత శుక్రవారం) నష్టాల్లో ముగిశాయి. ఇలా చాలా అరుదుగానే చూస్తుంటాం. ఎనిమిది రోజుల్లో కలిపి బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,645 పాయింట్లు కోల్పోగా (3.36 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) నష్టపోయింది. ‘‘డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశి్చతుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చు’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు.
వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ ఓషో కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ పతనానికి ఎన్నో అంశాలు దారిచూపాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లపై చేసిన ప్రకటన సెంటిమెంట్‌కు దెబ్బకొట్టింది. దీనికి అదనంగా క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇన్వెస్టర్ల విశ్వాసంపై ప్రభావం చూపించింది’’అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు.
దిగ్గజ కంపెనీల మార్కెట్
విలువ ఆవిరి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి మార్కె ట్ విలువ పరంగా టాప్–10లోని ఎనిమిది కంపెనీలు గడిచిన వారంలో రూ.2 లక్షల కోట్లకు పైన విలువను నష్టపోయాయి. అన్నింటిలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ నష్టాన్ని చూసింది. రూ.67,527 కోట్లు తగ్గి రూ.16,46,822 కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,951 కోట్ల మేర తగ్గి రూ.14,22,903 కోట్ల వద్ద ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.28,382 కోట్లను నష్టపోయింది.
మార్కెట్ విలువ రూ.12,96,708 కోట్లుగా ఉంది. ఐటీసీ రూ.25,430 కోట్ల నష్టంతో రూ.5,13,670 కోట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 19,287 కోట్లు తగ్గిపోగా, ఎస్‌బీఐ రూ.13,431 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.10,714 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4,230 కోట్లు చొప్పున మార్కెట్ విలు వను కోల్పోయా యి. ఎయిర్‌టెల్ మార్కె ట్ విలువ రూ.22,426 కోట్లు పెరగడంతో రూ.9,78, 631 కోట్లకు చేరింది. అలాగే, ఐ సీఐసీఐ బ్యాంక్ విలువ సైతం రూ.1,182 కోట్ల మేర లాభపడి రూ.8,88,815 కోట్లుగా ఉంది.
ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.21,272 కోట్లు
ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనూ ఎఫ్‌పీఐలు పెద్ద మొత్తంలో విక్రయాలు చేపట్టారు. నికరంగా రూ.21,272 కోట్లను ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. జనవరిలోనూ వీరు రూ.78,027 కోట్ల మేర అమ్మకాలు చేపట్టడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వీరు భారత ఈక్విటీల నుంచి రూ.99,299 కోట్లను వెనక్కి తీసుకెళ్లిపోయారు.
డెట్ విభాగంలో ఈ నెల మొదటి రెండు వారాల్లో నికరంగా రూ.1,296 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఎఫ్‌పీఐలు తిరిగి పెట్టుబడులతో రావొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. ‘‘స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించడం, ప్రతీకార సుంకాల ప్రణాళికలతో మార్కెట్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో భారతసహా వర్ధమాన మార్కెట్లలో తమ పెట్టుబడులను ఎఫ్‌పీఐలు సమీక్షిస్తున్నాయి’’అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment