ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
1న గంటపాటు ముహూరత్ ట్రేడింగ్
విదేశీ గణాంకాలపై ఇన్వెస్టర్ల దృష్టి
ఫలితాలు, డెరివేటివ్స్ ముగింపు కీలకం
ఆటుపోట్లకు చాన్స్ ఉందంటున్న నిపుణులు
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఈ వారం బీహెచ్‌ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల ఎఫెక్ట్
కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.
ఎప్పటిలాగే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్‌ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు.
విదేశీ అంశాలు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది.
2.2 శాతం డౌన్
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున
కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్
గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment