ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు | Sensex falls 180 points on profit-taking; banks slump | Sakshi
Sakshi News home page

ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు

Published Wed, Nov 27 2013 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు

ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు

 ఇరాన్ డీల్‌తో ఇన్వెస్టర్లలో వెల్లువెత్తిన ఉత్సాహం ఒక్కరోజులోనే చల్లారిపోయింది. మంగళవారం తిరిగి ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 111 డాలర్లకు పెరగడంతో ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 20,425 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 6,059 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
 మరో రెండు రోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం, శుక్రవారం క్యూ2 జీడీపీ డేటా వెల్లడికానుండటంతో చాలావరకూ లాంగ్ పొజిషన్లను ఇన్వెస్టర్లు స్క్వేర్‌ఆఫ్ చేసుకున్నారని, మార్కెట్ క్షీణతకు ఇది కూడా ఒక కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ప్రధాన ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా బలహీనంగా ముగిసాయి. క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన ఆయిల్ రిఫైనరీ షేర్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 5-6 శాతం పడిపోయాయి. చమురు ఉత్పాదక షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్‌లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-4 శాతం మధ్య తగ్గాయి.  ప్రపంచ ఇన్వెస్టర్లు ట్రాక్‌చేసే మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ నుంచి తొలగించిన కారణంతో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనీటెక్‌లు 5-8 శాతం మధ్య పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) తిరిగి రూ. 339 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు రూ. 357 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
 
 ఆర్‌ఐఎల్ కౌంటర్లో భారీ రోలోవర్స్...
 రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు 8 వారాల కనిష్టస్థాయి రూ. 841 వద్ద ముగియడం, ఈ షేరు సాంకేతికంగా కీలకమైన 830-840 మద్దతు శ్రేణి వద్దవుండటంతో డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు మంగళవారం రోలోవర్స్ భారీ జరిగాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 10 లక్షల షేర్లు కట్‌కాగా, డిసెంబర్ సిరీస్‌లో 23 లక్షల షేర్లు యాడ్‌కావడం విశేషం. ఈ నెల సిరీస్ ముగియడానికి మరో రెండురోజులు సమయం వున్నా, ఇప్పటికే డిసెంబర్ సిరీస్ ఆర్‌ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో బిల్డప్ 80.24 లక్షల షేర్లకు చే రింది. నవంబర్ సిరీస్ ప్రారంభంకావడానికి రెండు రోజుల ముందు.... అంటే అక్టోబర్ 29న నవంబర్ కాంట్రాక్టు బిల్డప్ 58 లక్షల షేర్లవర కే వుండేది.
 
  షేరు కీలక మద్దతుస్థాయిని సమీపించడంతో అటు షార్ట్, ఇటు లాంగ్ రోలోవర్స్ పెరగడాన్ని డిసెంబర్ బిల్డప్ సూచిస్తున్నది. సమీప భవిష్యత్తులో ఆర్‌ఐఎల్ ప్రస్తుత మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వచ్చే నెలలో ర్యాలీ జరపవచ్చని, మద్దతును కోల్పోతే వేగంగా పతనంకావొచ్చన్నది ఈ భారీ బిల్డప్ అంతరార్థం. కేజీ డీ6 క్షేత్రంలో మరో బావిని రిలయన్స్ మూసివేయడంతో అత్యంత కనిష్టస్థాయికి గ్యాస్ ఉత్పత్తి పడిపోయిందని, వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు గ్యాస్ ధరను గ్యారంటీ మొత్తాన్ని తీసుకుని ఆర్‌ఐఎల్‌కు వర్తింపచేస్తామంటూ కేంద్ర పెట్రో మంత్రి ప్రకటించడం వంటి అనుకూల, ప్రతికూల వార్తలు తాజాగా వెలువడ్డ నేపథ్యంలో ఈ బిల్డప్ జరగడం గమనార్హం.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement