
యూపీఏ, రూపాయిల విలువ పోయింది: మోడీ
రాజ్‌కోట్: యూపీఏ సర్కారు, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లపై బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రూపాయి, యూపీఏ సర్కారు రెండు కూడా విలువ కోల్పోయాయని, మన్మోహన్ మాదిరిగానే రూపాయి కూడా మూగబోయిందని ఎద్దేవా చేశారు. మోర్బీ ప్రాంతాన్ని రాజ్‌కోట్ నుంచి వేరు చేసి ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన సందర్భంగా మోడీని శనివారం ఇక్కడ సన్మానించారు. ఆయన ప్రసంగిస్తూ.. రూపాయి మరణశయ్యపైకి చేరిందని, దానికి అత్యవసర చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అసలు మనదేశం ఎందుకు సంక్షోభం వైపు పయనిస్తోందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేంద్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. సన్మానం సందర్భంగా మోర్బీలోని సిరామిక్ పరిశ్రమల యజమానులు మోడీకి వెండి కాసులతో తులాభారం వేసి.. 80 కేజీల వెండిని అందజేశారు. వెండిని వల్లభాయ్ పటేల్ ప్రతిమ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణానికి వాడతామని మోడీ చెప్పారు.