విజయ్ రూపానీకి స్వీట్ తినిపిస్తున్న పార్టీ నేతలు
న్యూఢిల్లీ: 22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గ్రామీణ గుజరాత్ బీజేపీకి ఎక్కువసీట్లను తెచ్చిపెట్టింది. అర్బన్ (పట్టణ), సెమీ–అర్బన్‌ప్రాంతాల్లోనైతే బీజేపీకి ఎదురేలేని పరిస్థితి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గ్రామీణ ప్రాంతాలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలనిచ్చాయి. గుజరాత్‌లోని మొత్తం 182 సీట్లలో 123 గ్రామీణ, 59 పట్టణ నియోజకవర్గాలున్నాయి. గ్రామీణ నియోజకవర్గాలు సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాల్లో ఎక్కువ. ఈ ప్రాంతాల్లో వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువ. ఇన్నాళ్లూ ఈ ప్రాంతంలో బీజేపీదే పైచేయి. అయితే.. రైతుల సమస్యలపై కొంతకాలంగా బీజేపీ పట్టించుకోవటం లేదని విపక్షాలు ఈ ప్రాంత ప్రచారంలో ప్రధానంగా పేర్కొన్నాయి.
కాంగ్రెస్ రైతులకు స్పష్టమైన హామీఇవ్వనప్పటికీ.. బీజేపీపై వ్యతిరేకతను వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం రైతుల ఆగ్రహానికి కారణం. దీనికితోడు ఈ ప్రాంతంలో పటీదార్లు చేతుల్లోనే ఎక్కువ భూమి ఉంటుంది. ఒపీనియన్ లీడర్లయిన పటేదార్ల ప్రభావం.. రైతుల వ్యతిరేకతగా వ్యక్తమైందనే విశ్లేషణలూ వినబడుతున్నాయి. అటు, వ్యవసాయంలో ఉన్న బీసీలూ ఈసారి స్వల్పంగా కాంగ్రెస్‌వైపు మొగ్గారు. మొత్తం 123 గ్రామీణ నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ 59 స్థానాల్లో (46.8 శాతం ఓట్లు), కాంగ్రెస్ 68 చోట్ల (45.8 శాతం ఓట్లు) విజయం సాధించాయి. గతంతో పోలిస్తే బీజేపీకి 14 సీట్లు తగ్గగా.. కాంగ్రెస్ 17 స్థానాలను అదనంగా గెలుచుకుంది. ఇది బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా గెలుచుకున్న సీట్లపై పెనుప్రభావాన్ని చూపింది.
బీజేపీతోనే గుజరాత్ ‘పట్టణం’
బీజేపీ గుజరాత్‌లో పగ్గాలు చేపట్టినప్పటినుంచీ పట్టణ ప్రాంతాలు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు ఇంకా వ్యాపార వర్గాలకు గుర్తున్న కారణంగా.. వీరంతా ఎప్పుడూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికి తోడు మోదీ 2001లో అధికారం చేపట్టిన తర్వాత గుజరాత్ పట్టణాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, వడోదరలో అంతర్జాతీయ స్థాయిలో బస్‌స్టేషన్.. ఇలా మిగిలిన పట్టణాల్లోనూ అధునాతన సౌకర్యాలు కల్పించటం ఇవన్నీ బీజేపీకి సానుకూలంగా మారాయి.
దీనికి తోడు గుజరాత్ పట్టణాల్లో ఆరెస్సెస్ ప్రభావం ఎక్కువగా ఉండటం బీజేపీకి అదనపు బలం. మధ్య గుజరాత్‌లో బీజేపీ గెలిచేందుకు కారణం కూడా ఈ ప్రాంతాల్లో పట్టణ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటమే. గుజరాత్ మోడల్ అవాస్తవమంటూ కాంగ్రెస్ పట్టణాల్లో ప్రచారం చేసినా ధ్రుఢమైన బీజేపీ ఓటును చీల్చలేకపోయింది. సూరత్‌లో జీఎస్టీ వ్యతిరేకత, పటీదార్ల ప్రభావం ఉన్నా 16 సీట్లకు గానూ బీజేపీ 15చోట్ల గెలవటం పట్టణ ప్రాంతాల్లో పట్టుకు సంకేతం. గుజరాత్‌లోని 59 అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ 47 (57.3 శాతం ఓట్లు), కాంగ్రెస్ 12 (37.9 శాతం ఓట్లు) సీట్లలో గెలుపొందాయి. పట్టణాల్లోని దాదాపు 80 శాతం నియోజకవర్గాలు బీజేపీ పరిధిలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment