గుజరాత్, హిమాచల్‌లో ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గులాబీ రేకుల వర్షంతో అమిత్‌షాకు ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యం
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే బీజేపీ కంచుకోటల్లో కాంగ్రెస్ పాగా వేసింది. గ్రామీణ నియోజకవర్గాల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంది. అయితే పట్టణ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు మాత్రం ఎప్పటిలాగే బీజేపీతోనే ఉన్నాయి. డిసెంబర్ 9న 89 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్ 14న రెండో విడతలో 93 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, మొదటి విడత ఎన్నికలు జరిగిన దక్షిణ గుజరాత్‌లో బీజేపీ పట్టు నిలుపుకోగా, కచ్–సౌరాష్ట్రలో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. అటు రెండో విడత ఎన్నికలు జరిగిన మధ్య గుజరాత్‌లో బీజేపీ సత్తాచాటింది. పటీదార్ ఉద్యమం ప్రబలంగా సాగిన ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ కాస్త వెనకబడినా.. ఓబీసీల ఓట్లతో గట్టెక్కింది. పటీదార్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి గడ్డుకాలం తప్పదనుకున్నా.. అంత తీవ్రమైన పరిస్థితులు కనిపించలేదు.
కచ్, సౌరాష్ట్ర ప్రాంతంలో 54 సీట్లున్నాయి. ఈ ప్రాంతంలోనూ పటేదార్లతో పాటు రైతుల ఓట్లు ఎక్కువ. గ్రామీణ గుజరాత్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని ఏళ్లుగా ఇది బీజేపీ కంచుకోట. కానీ ఈసారి మాత్రం.. కాంగ్రెస్ 30 స్థానాల్లో, బీజేపీ 23 చోట్ల గెలుపొందాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉండటం.. కాంగ్రెస్ కూడా రైతు సమస్యలను ప్రధానంగా లేవనెత్తటం బీజేపీకి సీట్లపై పెను ప్రభావం చూపింది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 35 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఉత్తర గుజరాత్‌లో మొత్తం 32 సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 17 చోట్ల, బీజేపీ 14 చోట్ల, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ఈ ప్రాంతంలో పటీదార్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతోపాటు.. పటీదార్ ఉద్యమం ఈ ప్రాంతంలో చాలా బలంగా సాగింది. దీనికి తోడు.. ఠాకూర్‌ల (ఓబీసీలు) ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి పటేళ్లు గట్టి దెబ్బ కొడతారనే ప్రచారం జరిగింది. కానీ పటీదార్లలోని లీవా పటేళ్లు (హార్దిక్ వర్గం కాని వారు) బీజేపీకి అండగా నిలిచారు. మొదటినుంచీ బీజేపీకి అండగా ఉన్న ఓబీసీలు ఈసారీ బీజేపీని గట్టెక్కించారు. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ తక్కువ సీట్లు గెలిచినప్పటికీ.. ఈ స్థానాల్లో విజయం కూడా అధికార పార్టీకి అత్యంత అవసరంగా మారింది.
మధ్య గుజరాత్‌లో 61 సీట్లున్నాయి. ఇరు పార్టీలకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. అహ్మదాబాద్, వడోదర, ఆనంద్, ఖేడా, పంచమహల్, ఛోటా ఉదయ్‌పూర్ (గిరిజనుల ప్రాబల్యం చాలా ఎక్కువ) ఇక్కడ పటేళ్లతోపాటు దళితులు, వ్యాపార వర్గాల ప్రాబల్యం ఎక్కువ. వ్యాపార వర్గాలూ ఇక్కడ ఫలితాలను నిర్దేశించే స్థితిలో ఉన్నారు. మధ్య గుజరాత్‌లో ఈసారి బీజేపీ 37 చోట్ల, కాంగ్రెస్ 22 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ 37 సీట్లు గెలుచుకుంది.
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment