అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి ధర మళ్లీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం ఒకానొకదశలో 1,330 డాలర్ల పైకి ఎగసింది. ఒకేరోజు దాదాపు 15 డాలర్లు పెరగడం గమనార్హం. గత ఏడాది మే తర్వాత పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. 2018 ఏప్రిల్‌లో పసిడి 1,365 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. అటు తర్వాత క్రమంగా పడిపోతూ, ఆగస్టు నెల మధ్యకు వచ్చే సరికి 1,167 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అయితే వెంటనే కోలుకుని 1,200 డాలర్ల స్థాయిని చూసినా, 20 డాలర్ల ప్లస్, మైనస్‌లతో దాదాపు రెండు నెలలు కదిలింది. తాజాగా మళ్లీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే అంతర్జాతీయంగా పసిడి పరుగు మున్ముందు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇక దీనికితోడు రూపాయి బలహీనత తోడయితే, దేశీయంగానూ పసిడి ధర చుక్కలను చూసే అవకాశం ఉంది. పసిడి కదలికలను గమనిస్తే...
పతన బాటలో...
► అమెరికా వృద్ధి ఊపందుకుందని, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50 శాతం) పెంపు జోరుగా ఉంటుందని, డాలర్ కూడా బలోపేతమవుతుందని గత ఏడాది మే తర్వాత వెలువడిన విశ్లేషణలు పసిడి పరుగును అడ్డుకున్నాయి.
► వృద్ధి బాగుంటుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పరుగుసైతం పసిడిలోకి పెట్టుబడులపై ప్రతికూలత చూపింది.
► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు ఒకవైపు ఉన్నప్పటికీ, మరోవైపు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, ఆర్థిక వృద్ధికి సవాళ్లు తొలుగుతాయన్న సానుకూలతలు పసిడిని ఆగస్టులో 52 వారాల కనిష్ట స్థాయి 1,167 డాలర్ల కనిష్ట స్థాయికి పడేశాయి.
పరుగు వెంట...
► అయితే పసిడికి 1,167 డాలర్ల ఉన్న సానుకూల పరిస్థితులు, మరింత ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు బంగారానికి బలమయ్యాయి.
► 1,200 డాలర్లు పసిడికి స్వీట్ స్టాప్ అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ దిగువకు పడిపోతే మైనింగ్ సంస్థలకు గిట్టుబాటు ధర రాదనీ, దీనితో పసిడి ఉత్పత్తి ఆగిపోతుందని, తిరిగి పసిడి 1,200 డాలర్లపైకి రావడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇది నిజమే అన్నట్లు 1,200 డాలర్ల దిగువకు పసిడి సంబంధిత సమీక్ష కాలంలో ఎప్పుడు పడినా, మళ్లీ ఆ ధర పైకి వెంటనే ఎగసేది.
► అదే సమయంలో చైనా ఫండ్స్‌సహా కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులూ పసిడి కొనుగోళ్లు జరిపాయి.
► అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం సవాళ్లు అందరూ భావించినట్లుగా తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఈ విషయం మరింత సుస్పష్టమైంది.
► మరోవైపు అమెరికా వృద్ధి అనుకున్నంత వేగంగా లేదని, ఫెడ్ ఫండ్‌రేటు పెంపు దూకుడు తగ్గవచ్చని సంబంధిత అధికారుల నుంచి సంకేతాలు అందాయి. దీనితో డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 95 స్థాయిలో) దూకుడు కూడా తగ్గింది.
► ఆయా వార్తల నేపథ్యంలో అమెరికాసహా అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్లూ గరిష్ట స్థాయిల నుంచి వెనక్కు తగ్గడం ప్రారంభమైంది.
► ఈ అంశాలు పసిడి తాజా పరుగుకు కారణమయ్యాయి. పసిడి అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర నిరోధ స్థాయి 1,300 డాలర్లను దాటింది.
► ఇవే పరిస్థితులు కొనసాగితే, పసిడి దూకుడు మున్ముందూ ఖాయమని ఆర్థిక, బ్యాంకింగ్, రిటైల్, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు విశ్లేషిస్తున్నారు.
2018లో 4 శాతం పెరిగిన డిమాండ్: డబ్ల్యూజీసీ
పసిడి డిమాండ్ 2018లో అంతర్జాతీయంగా 4% పెరిగింది. ఈ పరిమాణం 4,159.9 టన్నుల నుంచి 4,345.1 టన్నులకు పెరిగినట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. నివేదిక ప్రకారం... 2018లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 74% పెరిగాయి. 2017లో ఈ కొనుగోళ్లు 374.8 టన్నులయితే, 2018లో ఈ పరిమాణం 651.5 టన్నులకు చేరింది.
భారత్‌లో తగ్గింది...: భారత్‌లో డిమాండ్ 1.4% తగ్గింది. 2017లో దేశం పసిడి డిమాండ్ 771.2 టన్నులయితే, 2018లో ఈ మొత్తం 760కి తగ్గింది. రూపాయి పతనంతో అధిక ధరలు, కరెంట్ అకౌంట్‌లోటు పెరక్కుండా చూసేందుకు పసిడి ఫిజికల్ కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు, పథకాలు దీనికి కారణం. దేశంలో 2019లో 750 నుంచి 850 టన్నుల బంగారం డిమాండ్ ఉండవచ్చన్నది అంచనా అని కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. కాగా, విలువ రూపంలో బంగారం డిమాండ్ 2018లో 5% వృద్ధితో రూ.15.84 లక్షల కోట్ల నుంచి రూ.16.66 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం పెట్టుబడుల డిమాండ్4% తగ్గి 169 టన్నుల నుంచి 162 టన్నులకు పడింది.
దేశీయంగా రూ.38,000 వైపు!
ఇక దేశీయ మార్కెట్‌లోనూ పసిడి పటిష్టంగా ఉంది. అంతర్జాతీయంగా సానుకూల అంశాలతో పాటు, దేశీయంగా రూపాయి బలహీనతా దేశీయ మార్కెట్‌లో పసిడి బలానికి తోడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి పతనం 71పైన కొనసాగి, అంతర్జాతీయంగా ధర ఏడాది గరిష్ట స్థాయిని తాకితే, దేశంలో పసిడి 10 గ్రాముల ధర సమీపకాలంలోనే తేలిగ్గా రూ.38,000 దాటే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వచ్చింది. తాజాగా ప్రధాన మార్కెట్లన్నింటిలో పసిడి ధర రూ.34,000 దాటిపోవడం గమనార్హం. భారత్‌లో 2013 ఆగస్టులో పసిడి ధర గరిష్టస్థాయి రూ.35,000ని తాకింది. అప్పట్లో రూపాయి డాలర్ మారకంలో 68.85 స్థాయిలో ఉంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర 1,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా అంతర్జాతీయంగా పసిడి ఔన్స్ ధర 2011 ఆగస్టులో గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఈ ధర 1,917 డాలర్లు.
కొనసాగనున్న బంగారం మెరుపు
ఫెడ్ సరళతర ద్రవ్య విధానం నేపథ్యంలో పసిడి ధర మరింత పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి.20 రోజుల మూవింగ్ సగటు 1,291 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉంది. కరెన్సీల బలహీనతల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ‘ఆర్థిక మాంద్యం’ భయాలనూ సృష్టిస్తోంది. ఇవన్నీ ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌కు సానుకూల అంశాలే. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతోనే పసిడి తేలిగ్గా 1,425 డాలర్లను చేరే అవకాశం ఉంది. మా తక్షణ టార్కెట్ ధర 1,450.
– గోల్డ్‌మెన్ శాక్స్
మళ్లీ పసిడి ‘డ్రీమ్ రన్’!
Published Fri, Feb 1 2019 4:33 AM | Last Updated on Fri, Feb 1 2019 10:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment