నియంత్రణలపై భయాలొద్దు
Published Sat, Aug 17 2013 2:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
న్యూఢిల్లీ: రూపాయి పతనం కట్టడి కోసం పెట్టుబడులపై పరిమితులు విధించనున్నారన్న ఆందోళనల వల్ల శుక్రవారం స్టాక్‌మార్కెట్లు, దేశీ కరెన్సీ భారీగా పతనం కావడంతో ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ అర్జంటుగా రంగంలోకి దిగాయి. ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశాయి. పెట్టుబడులపై నియంత్రణ విధించే పాత విధానాలకు మళ్లే యోచనేదీ లేదని స్పష్టం చేశాయి. ‘పెట్టుబడులపై పరిమితులు విధిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాల ద్వారా కావొచ్చు..మరొకటి కావొచ్చు వ్యాపారపరమైన నిధులను విదేశాలకు తీసుకెళ్లడంపై ఎలాంటి పరిమితి విధించే ప్రసక్తే లేదు’ అని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం స్పష్టం చేశారు. డివిడెండ్లు, లాభాలు, రాయల్టీలు మొదలైన వాటితో పాటు సాధారణ వ్యాపార లావాదేవీలకు సంబంధించి నిధుల తరలింపును నియంత్రించే యోచనేదీ లేదని చెప్పారు. దేశీ స్టాక్ మార్కెట్లు సెంటిమెంట్లపైనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని, ప్రస్తుత పరిస్థితులన్నీ ప్రభుత్వానికి తెలుసని మాయారాం చెప్పారు. అవసరమైన సమయాల్లో రూపాయి స్థిరంగా ఉండే పరిస్థితులను కల్పించే ఉద్దేశంతోనే చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రూపాయి భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మాయారాం వివరించారు. అలాగని, నిర్ణీతస్థాయి దగ్గర రూపాయిని నిలువరించాలన్న ఆలోచనేదీ లేదని చెప్పారు.
ప్రస్తుతం, భారత్ తరహాలోనే ప్రపంచమార్కెట్లన్నీ కూడా ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. రూపాయి ప్రభావం ఈక్విటీ మార్కెట్లపైనా.. అలాగే ఈక్విటీ మార్కెట్ల ప్రభావం రూపాయిపైనా పడుతోందన్నారు. ఇదొక విష వలయం లాంటిదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్‌బీఐ తమ అస్త్రాలన్నీ వాడేయకుండా.. వృద్ధిని దెబ్బతీయని విధంగా చిన్నపాటి చర్యలు మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నాయని అధికారి పేర్కొన్నారు. కావాలంటే లిక్విడిటీని పూర్తిగా కట్టడి చేసి రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చని, కానీ దీనివల్ల వృద్ధి దెబ్బతింటుందన్నారు.
ఎఫ్‌ఐఐలపై ఆంక్షలు లేవు..
మరోవైపు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) నిధులపై భారత్ ఏనాడూ ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వర్గాలు తెలిపాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం ఫెమా కింద ఇది చట్టవిరుద్ధం అవుతుందని పేర్కొన్నాయి. విదేశీ మారకం తరలిపోకుండా చూసేందుకు బుధవారం ప్రకటించిన చర్యలను .. మళ్లీ పాత విధానాలకు మళ్లడంగా భావించనక్కర్లేదని వివరించాయి. నిధులు విదేశాలకు తరలిపోకుండా చూడటమనేది..ప్రభుత్వం పెట్టుబడుల రాకను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే చూడాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పెరుగుతున్న మొండి బకాయిలతో కార్పొరేట్లు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా.. వాటి ఆస్తులు, అప్పులను మదింపు చేసేందుకే తాజా చర్యలను ఉద్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు గత నెల నుంచి ఆర్‌బీఐ, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ మారకం నిల్వలు కరిగిపోకుండా చూసేందుకు ఆర్‌బీఐ ఈ నెల 14న కొన్ని కఠిన చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశీ కంపెనీలు విదేశాల్లో చేసే పెట్టుబడులపైనా, భారతీయులు విదేశాల్లోని వారికి చేసే రెమిటెన్సులపైనా పరిమితులు విధించింది.
దిగుమతులపై మరిన్ని నియంత్రణలేమీ ఉండవు..
కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు నిత్యావసరంకాని ఇతర దిగుమతులపై మరిన్ని సుంకాల పెంపు చర్యలేమీ ఉండబోవని మాయారాం చెప్పారు. పసిడి, వెండి, ప్లాటినం వంటి నిత్యావసరం కాని వస్తువులపై సుంకాలను పెంచడం సరిపోతుందని తెలిపారు. దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఈ మూడింటిపైనా దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఈ వారంలోనే 10 శాతం మేర పెంచింది.
Advertisement