తగ్గుతున్న గోదావరి
తగ్గుతున్న గోదావరి
Published Wed, Sep 28 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లో చేరుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. మంగళవారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 7 గంటలకు 7.42 మీటర్లు నీటిమట్టం చేరుకోగా మధ్యాహ్నం 2 గంటలకు 7.20 మీటర్లకు పడిపోయింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు, రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముల్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్‌లకు ఆనుకొని గోదావరి ప్రవహిస్తోంది. రాంనగర్- రామన్నగూడెం మధ్యలోని లోలెవల్ కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ప్రజల రాకపోకలకు పడవ ఏర్పాటు చేశారు. గోదావరి వచ్చినప్పుడల్లా తమకు ఈ బాధలు తప్పడం లేదని ఆ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ను ఆర్డీఓ మహేందర్‌జీ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. గోదావరి వరద ఎంత మేర తగ్గిందని కేంద్ర జలవనరుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఘాట్ వద్ద ఉంటూ గోదావరి వరద ఉధృతిని పరిశీలించి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయనవెంట తహశీల్దార్ నరేందర్, ఆర్‌ఐ సర్వర్‌పాషా, వీఆర్‌ఓలు నర్సయ్య, రాములు, మల్లేశం ఉన్నారు.
Advertisement
Advertisement