న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది.
డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.
ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment