న్యూఢిల్లీ: భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తుండడం తెలిసిందే.
వారి వాటాల విలువ తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక 2021 మార్చి నాటికి ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 552 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం విలువ)లో ఎఫ్‌పీఐల వాటా విలువ పరంగా 18.3 శాతం నుంచి 17.8 శాతానికి తగ్గింది. మన దేశ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్‌షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు.
విక్రయాలు..
మార్నింగ్‌స్టార్ నివేదిక పరిశీలిస్తే.. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. 14.59 బిలియన్ డాలర్ల మేర (రూ.1.13 లక్షల కోట్లు) అమ్మకాలు చేశారు. జనవరిలో 4.46 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 4.74 బిలియన్ డాలర్లు, మార్చిలో 5.38 బిలియన్ డాలర్ల చొప్పున విక్రయాలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది.
ఈక్విటీల్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ‘‘త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతానంటూ యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనతో మార్చి త్రైమాసికం ఆరంభంలోనే సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని విదేశీ ఇన్వెస్టర్లు వేగవంతం చేశారు’’ అని మార్నింగ్ స్టార్ పేర్కొంది.
ఆదుకున్న ఫండ్స్..
దేశీయంగా వృద్ధి ఆధారిత బడ్జెట్, కరోనా మూడో విడత సాధారణంగా ఉండడం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. విక్రయాల ఒత్తిడి కొద్దిగా తగ్గేలా సాయపడ్డాయి. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇనిస్టిట్యూషన్స్ కొనుగోళ్ల ఈక్విటీ మార్కెట్లను చాలా వరకు ఆదుకున్నాయి. సిప్ రూపంలో ప్రతీ నెలా రూ.11వేల కోట్లకుపైనే పెట్టుబడులు వస్తుండడంతో.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆకర్షణీయ వ్యాల్యూషన్లకు దిగొస్తున్న కంపెనీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిస్తుండడం గమనార్హం.
ప్రతికూలంగా మారిన పరిస్థితులు
చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికాలో ఈ పరిస్థితులే రేట్ల పెంపునకు దారితీయడం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఫీఐలు భారత ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలు పెట్టగా.. రష్యాపై పలు దేశాల ఆంక్షలను చూసి ఇన్వెస్టర్లు అమ్మకాలను మరింత పెంచారు. అప్పటి నుంచి అస్సలు కొనుగోళ్ల వైపే వారు ఉండడం లేదు.
2018 తర్వాత ఫెడ్ మొదటిసారి రేట్లను పెంచడం కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది. మరిన్ని విడతలుగా రేట్లను పెంచనున్నట్ట కూడా ఫెడ్ స్పష్టం చేసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు చేసిన విక్రయాలు 18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీప కాలంలోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించొచ్చని మార్నింగ్ స్టార్ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment