న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్ 2020 డిసెంబర్‌లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్‌లోని క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్‌లో ఈ గ్రూప్ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన మౌలిక రంగం గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► 2020 డిసెంబర్‌లో బొగ్గు, విద్యుత్ మినహా అన్ని రంగాలూ క్షీణతను చూశాయి.
► క్రూడ్ ఆయిల్ (–3.6 శాతం), సహజ వాయువు (–7.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.8 శాతం), ఎరువులు (–2.9 శాతం), స్టీల్ (–2.7 శాతం), సిమెంట్ (–9.7 శాతం) క్షీణతలో ఉండగా, బొగ్గు (2.2 శాతం), విద్యుత్ (4.2 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి.
► 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, గ్రూప్ ఉత్పత్తి క్షీణత 10.1 శాతంగా ఉంది. 2019–20 ఇదే సమయంలో 0.6 శాతం స్వల్ప వృద్ధి రేటు నమోదయ్యింది.
► కాగా 2020 సెప్టెంబర్‌లో గ్రూప్ 0.1 శాతం క్షీణత నమోదుచేసుకున్నట్లు తొలి గణాంకాలు పేర్కొనగా, తాజాగా ఈ గణాంకాలను 0.6 శాతం వృద్ధిగా సవరించడం జరిగింది.
నిరాశ కలిగిస్తోంది...
కీలక మౌలిక రంగం వరుసగా మూడవనెల డిసెంబర్‌లోనూ క్షీణతలో కొనసాగడం నిరాశను కలిగిస్తోంది. అయితే ఆటో పరిశ్రమ పురోగతి, చమురు యేతర ఉత్పత్తుల ఎగుమతులు తత్సబంధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే, డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ– ఐఐపీ స్వల్పంగానైనా 0.5 శాతం నుంచి 1.5 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం.
– అదితి నాయర్ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్
మౌలికం... డిసెంబర్‌లో 1.3 శాతం ‘మైనస్’
Published Sat, Jan 30 2021 6:05 AM | Last Updated on Sat, Jan 30 2021 10:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment