పరిశ్రమలు, విద్యుత్ చంద్రబాబు వద్దే
* కోరుకున్న మేరకు సీనియర్లకు శాఖల సర్దుబాటు
* పలు శాఖల విలీనం... మిగతా వారికి కేటాయింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను ఖరారు చేశారు. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో చేపట్టాల్సిన అనేక అంశాలకు సంబంధించిన కీలక శాఖలను చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నట్లు శాఖల కేటాయింపును చూస్తే అర్థమవుతుంది. న్యాయ, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నారు.
వీటితో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను కూడా చంద్రబాబుకే దఖలు పడనున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలతో ముడిపడి ఉన్న మౌలికసదుపాయాలు, పెట్టుబడులు శాఖ చంద్రబాబు వద్దే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరమేర్పడింది. కేంద్రం కూడా పారిశ్రామికాభివృద్ధికి వీలుగా రాష్ట్రానికి ప్రత్యేక పతిపత్తిని కల్పించి పన్ను రాయితీలను కల్పించనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఐదేళ్లపాటు ప్రత్యేక పతిపత్తిని ప్రకటించింది. అది వాస్తవరూపం దాల్చితే పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి వందల కోట్లమేర పన్ను రాయితీ లభించనుంది.
పరిశ్రమలకు అనుమతులు, రాయితీల మంజూరు తదితర అనేక అంశాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల పాత్ర చాలా కీలకం కానుంది. యనమల రామకృష్ణుడికి ఇదివరకు ఆయన నిర్వహించిన ఆర్థిక, శాసనసభా వ్యవహారాలతో పాటుగా వాణిజ్యపన్నుల శాఖను కూడా అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖను పట్టుబట్టి దక్కించుకున్నారు.
పంచాయతీరాజ్ శాఖతో గ్రామీణ నీటిసరఫరా, ఎన్నార్యీజీఎస్ విభాగాలను జతచేసి అయ్యన్నపాత్రుడికి ఇచ్చారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా ఈసారి అడవులు, పర్యావరణ శాఖతో సరిపెట్టారు. తమకు శాఖలను కేటాయించినందుకు పలువురు మంత్రులు చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశాఖపట్నంలో గురువారం తొలిభేటీ జరగనుండడంతో అక్కడకు వెళ్లారు.