core infra industries
-
‘బేస్’ మాయలో ఏప్రిల్ మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌పై ఏప్రిల్‌లో పూర్తి ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 ఏప్రిల్‌ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్‌లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే... ► సహజ వాయువు: 19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది. ► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది. ► స్టీల్: 82.8 శాతం మైనస్ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్ చేసింది. ► సిమెంట్: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది ► విద్యుత్: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్ తీసుకుంది. ► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది. ► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► క్రూడ్ ఆయిల్: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఏప్రిల్‌లోనూ దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్ నాటి మైనస్ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట. ఐఐపీ 150% పెరిగే చాన్స్! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్ ఎఫెక్ట్ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
మౌలికం... డిసెంబర్లో 1.3 శాతం ‘మైనస్’
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్ 2020 డిసెంబర్లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్‌లోని క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్లో ఈ గ్రూప్ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన మౌలిక రంగం గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 డిసెంబర్లో బొగ్గు, విద్యుత్ మినహా అన్ని రంగాలూ క్షీణతను చూశాయి. ► క్రూడ్ ఆయిల్ (–3.6 శాతం), సహజ వాయువు (–7.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.8 శాతం), ఎరువులు (–2.9 శాతం), స్టీల్ (–2.7 శాతం), సిమెంట్ (–9.7 శాతం) క్షీణతలో ఉండగా, బొగ్గు (2.2 శాతం), విద్యుత్ (4.2 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, గ్రూప్ ఉత్పత్తి క్షీణత 10.1 శాతంగా ఉంది. 2019–20 ఇదే సమయంలో 0.6 శాతం స్వల్ప వృద్ధి రేటు నమోదయ్యింది. ► కాగా 2020 సెప్టెంబర్‌లో గ్రూప్ 0.1 శాతం క్షీణత నమోదుచేసుకున్నట్లు తొలి గణాంకాలు పేర్కొనగా, తాజాగా ఈ గణాంకాలను 0.6 శాతం వృద్ధిగా సవరించడం జరిగింది. నిరాశ కలిగిస్తోంది... కీలక మౌలిక రంగం వరుసగా మూడవనెల డిసెంబర్‌లోనూ క్షీణతలో కొనసాగడం నిరాశను కలిగిస్తోంది. అయితే ఆటో పరిశ్రమ పురోగతి, చమురు యేతర ఉత్పత్తుల ఎగుమతులు తత్సబంధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే, డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ– ఐఐపీ స్వల్పంగానైనా 0.5 శాతం నుంచి 1.5 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. – అదితి నాయర్ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్