సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం గతి శక్తి పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్రం పీఎం గతిశక్తి కింద దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను జాతీయ రహదారులు, పోర్టులతో అనుసంధానం, మౌలిక వసతుల కల్పన చేపట్టింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రూ.5 వేల కోట్లు కేటాయించింది.
చదవండి: ‘యనమల’ పిల్లి శాపాలు.. ఉనికి చాటుకునేందుకేనా?
ఈ పథకం కింద మన రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతుల కోసం రూ.781.88 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఓర్వకల్లు, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లకు నీటి సరఫరాకు రూ. 459 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు 74 ఎంఎల్‌డీ నీటిని తరలించే రూ.288 కోట్ల ప్రాజెక్టు, కొప్పర్తి జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 46 ఎంఎల్‌డీ నీటిని రూ.171 కోట్ల వ్యయంతో తరలించే ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి. అదే విధంగా రూ.322.88 కోట్లతో ఏడు ప్రాజెక్టుల భూసేకరణ ప్రతిపాదనలను పంపింది.
ఈ ఏడు ప్రాజెక్టుల్లో రూ. 34.05 కోట్లతో నాయుడుపేట క్లస్టర్‌ను అనుసంధానించే రహదారి, రూ.16.74 కోట్లతో రౌతు సురమాల పారిశ్రామిక క్లస్టర్ అనుసంధానం, రూ.6.93 కోట్లతో ఎన్‌హెచ్ 16 నుంచి నక్కపల్లి క్లస్టర్‌ను అనుసంధానించే ప్రాజెక్టు, రూ.106.98 కోట్లతో అచ్యుతాపురం –అనకాపల్లి నాలుగులైన్ల రహదారి, రూ.15 కోట్లతో కియా మోటార్స్ వద్ద ఆర్‌వోబీ నిర్మాణం, రూ.50 కోట్లతో కొప్పర్తికి రైల్వే లైన్ అనుసంధానం, రూ.93.18 కోట్లతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ఉన్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యతమిస్తున్నామని, ఇందులో భాగంగానే పీఎం గతిశక్తి పథకానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లాజిస్టిక్ వ్యయం తగ్గించడానికి విశాఖ, అనంతపురంలలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment