ఏపీ బాటలో కేంద్రం..  | Central Govt Focus to infrastructure in villages | Sakshi
Sakshi News home page

ఏపీ బాటలో కేంద్రం.. 

Published Fri, Aug 18 2023 5:41 AM | Last Updated on Fri, Aug 18 2023 8:52 AM

Central Govt Focus to infrastructure in villages - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో మాదిరిగానే గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కూడా నడుంబిగించింది. ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగానే కేంద్రం కూడా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు అనుబంధంగా వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు (వరల్డ్స్‌ లార్జెస్ట్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు)కు శ్రీకారం చుట్టింది.

ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద పీఏసీఎస్‌ స్థాయిలో గోదాముతో పాటు అత్యాధునిక రైస్‌మిల్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని మృత్యుంజయ సహకార సమితి పీఏసీఎస్‌ను ఎంపిక చేశారు. సొసైటీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈ పీఏసీఎస్‌కు అన్ని విధాలుగా వయబులిటీ ఉందని గుర్తించి దీనిని ఎంపిక చేశారు.
 
డీపీఆర్‌ తయారీ.. 
ఇక జాతీయస్థాయిలో ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నాబ్‌స్కాన్‌ ఈ ప్రాజెక్టు కోసం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారుచేసింది. ఈ బృందం ఇటీవలే ఆచంట పీఏసీఎస్‌ను సందర్శించి సంతృప్తి కూడా వ్యక్తంచేసింది. ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన రెండెకరాల భూమిలో సాయిల్‌ టెస్టింగ్‌ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కింద..  

► రూ.2.14 కోట్ల అంచనాతో ఆహార ధాన్యాల నిల్వ­కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారు.  
► రూ.86.20 లక్షల అంచనా వ్యయంతో.. 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోదాము నిర్మిస్తారు.  
► రూ.1,12,86,000 అంచనా వ్యయంతో గంటకు రెండు టన్నుల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక కలర్‌ సార్టెక్స్‌ రైస్‌మిల్‌ను నిర్మిస్తారు.  
► ఏన్సలరీ, సపోర్టింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.14.06 లక్షల అంచనాతో విద్యుత్, అగ్నిమాపక సౌకర్యాలు కల్పిస్తారు.  
► అంతేకాక.. పీఏసీఎస్‌కు ప్రత్యేకంగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద రూ.1.18 లక్షల అంచనాతో డ్రోన్‌ను కూడా సమకూరుస్తారు.  
► ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వ్యయంలో 20% (రూ.42.86 లక్షలు) సొసైటీ సమకూర్చుకుంటే, మిగిలిన 80% (రూ.171.44 లక్షలు) ఆప్కా­బ్‌ ద్వారా ప్రభుత్వం రుణం సమకూరుస్తుంది.  
► ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన చేస్తారు. నవంబరు నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 

ఏపీ బాటలోనే.. 
ఏపీ బాటలోనే పీఏసీఎస్‌ స్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయా­లు కల్పించాలన్న సంకల్పం­తో కేంద్రం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి∙ఆచంట పీఏసీఎస్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ రూ.2.14 కోట్లతో గోదాము, రైసుమిల్లు, ఇతర వసతులు కల్పిస్తారు.         
– అహ్మద్‌ బాబు, కమిషనర్, సహకార శాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement