AP: డిసెంబర్‌ నాటికి రాష్ట్ర విజన్‌ ప్రణాళిక–2047 | Superiors started AP Vision Plan 2047 Collaboration with NITI Aayog | Sakshi
Sakshi News home page

AP: డిసెంబర్‌ నాటికి రాష్ట్ర విజన్‌ ప్రణాళిక–2047

Published Thu, Oct 26 2023 5:45 AM | Last Updated on Thu, Oct 26 2023 11:27 AM

Superiors started AP Vision Plan 2047 Collaboration with NITI Aayog - Sakshi

సాక్షి, అమరావతి: వికసిత్‌ భారత్‌–2047లో భాగంగా నీతి ఆయోగ్‌ సహకారంతో రాష్ట్ర  ను డిసెంబర్‌ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ధికి ఆయా శాఖలవారీగా దృక్కోణ ప్రణా­ళి­కలను రూపొందించేందుకు మార్గదర్శ­కాలు, సూ­చనలు, సలహాలను నీతి ఆయోగ్‌ అధికారులు రాష్ట్ర అధికారులకు అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచి­వాలయంలో బుధవారం వర్క్‌షాప్‌ ప్రారంభమైంది.

మూడు రోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. తొలి రోజు వర్క్‌షాప్‌ నీతి ఆయోగ్‌ అదనపు కా­ర్యదర్శి వి.రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సంద­ర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదు­ర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌–2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవస­ర­మైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపైన కూడా దృష్టి సారించిందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర విజన్‌ ప్రణా­ళిక – 2047ను రూపొందించేందుకు రాష్ట్ర అధికా­రు­లకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్‌ అందిస్తోందని చెప్పారు. దీన్ని రాష్ట్ర అధికారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర విజన్‌ ప్రణాళికను సమగ్రంగా సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని కోరారు. 

వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు
కాగా తొలి రోజు వర్క్‌షాప్‌లో ఉదయం సామా­జిక రంగం, మధ్యాహ్నం ప్రాథమిక రంగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా బలాలు, బల­హీనతలు, అవకాశాలు, సవాళ్లను ఆయా శాఖల అధికారులు నీతి ఆయోగ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌ జె.నివాస్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరీందిర ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదిత­రులతోపాటు నీతి ఆయోగ్‌ సలహాదారు సీహెచ్‌ పార్థసారధి రెడ్డి, పబ్లిక్‌ పాలసీ నిపుణులు అమ్రిత్‌ పాల్‌ కౌర్, సీనియర్‌ కన్సల్టెంట్‌ శైలీ మణికర్, పర్యవేక్షణ – మూల్యాంకన నిపుణులు బిప్లప్‌ నంది, బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అంకష్‌ వథేరా తదితరులు పాల్గొన్నారు. 

ప్రణాళికలను రూపొందిస్తున్నాం..
రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్‌ మాట్లాడుతూ.. వికసిత్‌ భారత్‌–2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవస­రమైన దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద­న్నా­రు. ముఖ్యంగా ప్రాథమిక రంగంలో.. వ్యవ­సాయం, పశుసంవర్థకం, డెయిరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, సహ­కారం, అటవీ, జలవనరులు, భూగర్భ జలా­లు, చిన్ననీటి పారుదల, కమాండ్‌ ఏరియా అభివృద్ధి వంటి అంశాల్లో దృక్కోణ ప్ర­ణా­ళి­క­లను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ద్వితీయ రంగంలో.. ఇంధనం, రవాణా, ఐటీ, ప­ర్యా­టకం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఆహార శుద్ధి, గనుల తవ్వకం, చేనేత–జౌళి, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపైన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజిక రంగం అ­భి­వృద్ధిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షే­మం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశా­లపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నా­రు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement