
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆయన తిరుగులేని నేత. ఏ రాష్ట్రానికి ఇన్‌చార్జీగా వెళితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం. పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని బెదిరించే పనిలో కూడా ఉండేవారు. అయినా వినకుండా సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించడంలో క్రియాశీలక పాత్ర. కానీ ఇప్పుడు అదే నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఏభై ఏళ్లపాటు కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పడవ నుంచి జంప్ చేసేశారు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు.
చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం?
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని అనడానికి ఇది కూడా నిదర్శనమే అవుతుంది. గతంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత విధేయుడుగా ఆజాద్ పేరొందారు. అలాంటి వ్యక్తి పార్టీకి ఎందుకు దూరం అయ్యారంటే రకరకాల విశ్లేషణలు వస్తాయి. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అసమర్దతా? లేక వారిలో ప్రజాకర్షణ కొరవడిపోయిందన్న భావనా? అజాద్ రాజకీయ స్వార్థ చింతనా? తనకు మళ్లీ రాజ్యసభ ఇవ్వలేదన్న ఆక్రోశమా? బీజేపీ విసిరిన గాలమా?.. ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవన్ని వాస్తవాలే కావచ్చు.
అజాద్ చిన్నవయసులోనే పార్టీలో యాక్టివ్ అయ్యారు. దానికి తగినట్లే పదవులు కూడా వచ్చాయి. పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేత హోదాను అనుభవించారు. కానీ గతసారి ఆయనకు మళ్లీ ఆ పదవి ఇవ్వలేదు. కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నేత మల్లిఖార్జున్‌కు అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రాజ్యసభ సీటును రెన్యూ చేశారు. ఇవన్ని ఆయనకు అవమానంగా మారాయి. మరో వైపు కాంగ్రెస్‌లో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలలో ఈయన ప్రముఖుడు, అప్పటి నుంచే తేడా వచ్చిందన్న సంగతి అర్ధం అయింది.
పుండు మీద కారం చల్లినట్లు రాజ్యసభలో అజాద్ రిటైర్ అయిన రోజున ప్రధాని మోదీ ఈయన పట్ల చూపిన జాలి కాంగ్రెస్ వారికే ఆశ్చర్యం కలిగించింది. ఆజాద్‌ను మోదీ ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అజాద్ బీజేపీలోకి వెళతారని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఊహాగానాలు వచ్చాయి. అది జరగలేదు. మళ్లీ ఈ మధ్య కాంగ్రెస్‌లో కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ తరుణంలో సడన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, నాలుగు పేజీల లేఖ రాసి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బాడీగార్డులు, పిఏలతోనే రాహుల్ సంప్రదిస్తారని, పిల్ల చేష్టలతో పరువు తీస్తుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు లేకపోలేదు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కోర్టు తీర్పును పూర్వపక్షం చేయడం కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. ఆ తీర్పులో రెండేళ్ల శిక్ష పడితే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి పోతుందని ఉంది. దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్ పెట్టి మరీ చించివేశారు. దాంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం బాగా డామేజీ అయింది. దానినే ఇప్పుడు అజాద్ కోట్ చేస్తున్నారు. అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పటివరకు ఎందుకు అజాద్ ప్రశ్నించలేదంటే, అదే రాజకీయం. తన పదవి పోకుండా ఉండడం కోసం అజాద్ మాట్లాడలేదన్నమాట.
కాంగ్రెస్‌ను వీడడమే కాకుండా కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఈయనకు మద్దతుగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటే అధిష్టానానికి ఆగ్రహం వచ్చింది. దాంతో ప్రత్యర్ది పార్టీ అయిన తెలుగుదేశంతో కలిసి జగన్ పై కేసులు పెట్టింది. ఆ ప్రక్రియలో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో అజాద్ ది కూడా కీలకపాత్రే అన్న అభిప్రాయం ఉంది. ఆ ఒక్క పరిణామంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
అంతేకాదు.. తెలంగాణ ఏర్పాటు హామీ ఇవ్వడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. 2004లో ఏపీలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికిగాను తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, జి.వెంకటస్వామి వంటివారు పట్టుబట్టారు. ఆ టైమ్‌లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్‌తో పొత్తును వ్యతిరేకించారు. అయినా అజాద్ టి.కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అవన్ని వెరసి కాంగ్రెస్ పతనానికి దారి తీశాయి.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలలోకి వెళ్లిపోయారు. వారిలో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో అజాద్ ఒక విషయం బహిరంగంగానే చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని వీడటం వల్ల కష్టాలు పడతారని హెచ్చరించారు. నిజంగానే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా తగ్గించాలన్న తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి జైలులో పెట్టించిందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలింది.
జగన్ ఫ్యాక్టర్, తెలంగాణ అంశం కలిసి ఏపీలో కాంగ్రెస్ సర్వనాశనం అయితే, తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవడంలో విఫలం అయి, కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించుకోలేకపోయింది. కేసీఆర్ వ్యూహరచన, స్పీడ్ ముందు కాంగ్రెస్ విలవిలలాడింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇలా ఒక్కో పరిణామం తర్వాత మరో పరిణామం సంభవించడం ద్వారా కాంగ్రెస్ కునారిల్లే పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో శరద్ పవార్, మమత బెనర్జీ, మూపనార్,.. ఇలా అనేకమందిని కోల్పోతూ ఇప్పుడు గులాం నబీ అజాద్‌ను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీని ప్రభావం సహజంగానే దేశ స్థాయిలో కాంగ్రెస్‌పై పడుతుంది. కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, తదుపరి బీజేపీతో పొత్తు పెట్టుకుని అజాద్ మళ్లీ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి అవుతారా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment