అనంతపురం : చలి సంపేత్తోంది బాబాబోయ్ అంటున్నారు జిల్లా జనం. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఆదివారం ఉదయం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లులో 11.9, అగళిలో 12.5, రొద్దంలో 12.8 డిగ్రీలకు పడిపోయింది. అమడగూరు 13.1 డిగ్రీలు, సోమందేపల్లి 13.3, చిలమత్తూరు, నల్లమాడ, గుత్తిలో 13.5, కనగానపల్లి 13.7, గాండ్లపెంట 13.8, పెనుకొండ 13.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల మధ్య ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 90 శాతం మధ్య రికార్డయింది. ఈశాన్య, ఆగ్నేయ గాలులు గంటకు 6 నుంచి 10 కి.మీ. వేగంతో వీచాయి. సాయంత్రం, ఉదయం శీతలగాలులు ఇబ్బంది పెడుతున్నాయి.
ఈసారి జిల్లావ్యాప్తంగా మంచి వర్షాలు పడటం, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, పంటలు, కొండలు, అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకోవడంతో సహజంగానే చలి పెరిగింది. తమిళనాడు, కేరళలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఈనెల మొదట్లో వారం పది రోజులపాటు మేఘాలు ఆవరించడంతో చలి తీవ్రత అంతగా లేదు. కానీ వారం రోజులుగా వాతావరణం మారడంతో చలిపులి ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటోంది. వేకువజామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. పిల్లలు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మడకశిర, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగానే ఉంటోంది.