ఎండ వేడిమి నుండి రక్షణకు మండుటెండలో బైక్‌పై దూసుకెళుతున్న యువతులు
అనంతపురం అగ్రికల్చర్ సూరీడు అగ్నిగోళమై మండుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు ‘అనంత’ అట్టుడుకుతోంది. వేసవితాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండేఎండలకు తోడు ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత అధికం కావడంతో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సోమవారం తాడిమర్రిలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొళ్లలో 24.6 డిగ్రీలు కనిష్టం నమోదైంది. అనంతపురం, పెద్దవడుగూరు, పామిడి 43.4 డిగ్రీలు, తాడిపత్రి, యాడికి 43.2 డిగ్రీలు, గుంతకల్లు 43.1 డిగ్రీలు ఉండగా, పుట్లూరు, యల్లనూరు, తనకల్లు, కదిరి, బుక్కపట్నం, రాయదుర్గం, గుమ్మఘట్ట, రాప్తాడు, కనగానపల్లి, ముదిగుబ్బ, పెద్దపప్పూరు, ధర్మవరం, ఓడీ చెరువు, బత్తలపల్లి, కూడేరు, బుక్కరాయసముద్రం, నార్పల, అగళి, గాండ్లపెంట, ఆత్మకూరు, లేపాక్షి, బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి, శెట్టూరు, శింగనమల, కంబదూరు మండలాల్లో కూడా 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో గరిష్టంగా 37 నుంచి 39 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 30 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం 54 నుంచి 62, మధ్యాహ్నం 24 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచాయి. బత్తలపల్లి, గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, నల్లచెరువు, రాయదుర్గం, పుట్లూరు, పామిడి, వజ్రకరూరు, యాడికి, చెన్నేకొత్తపల్లి, తలుపుల మండలాల్లో గాలివేగం ఎక్కువగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment