ప్రతి యేటా మండుటెండలు, తీవ్ర వడగాడ్పులతో దడ పుట్టించే మే నెల ఈ సారి మాత్రం ప్రతాపం చూపించలేదు. మే లో దాదాపు 25 రోజుల పాటు సాధారణం, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవడంతో వడగాడ్పుల ప్రభావం కనిపించలేదు. మే ఆఖరులో ఒకింత ఉష్ణోగ్రతలు పెరిగినా అదుపు తప్పకపోవడంతో తీవ్ర వడగాడ్పులు వీయలేదు. ఫలితంగా ఈ ఏడాది ఒక్క వడదెబ్బ మరణం కూడా నమోదు కాలేదు.
అయితే ఈ ఏడాది వడగాడ్పులు ఒక నెల ముందుగా ఏప్రిల్ ఆరంభం నుంచే మొదలై 7 రోజుల పాటు ప్రభావం చూపాయి. ఇలా ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా కురిచేడు, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుల్లోను, కృష్ణా జిల్లాలో కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 5–8 డీగ్రీలు అధికం కావడంతో కొన్నిచోట్ల వడగాడ్పులు, అక్కడక్కడా తీవ్ర వడగాడ్పులు వీచాయి. దీంతో మే లో ఉష్ణతీవ్రత ఇంకెంత ఉధృతం అవుతుందోనని ఆందోళన వ్యక్తమైంది. కానీ, మే మొదటి 3 వారాలూ రాష్ట్రంలో పలుచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మే నాలుగో వారం ఆఖరులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికం. ఇలా మే లో ఏపీలోని 670 మండలాల్లో 32 మండలాలకే వడగాడ్పులు పరిమితమయ్యాయి. సాధారణం కంటే 6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతేనే తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ఈ మే లో ఒక్కరోజూ తీవ్ర వడగాడ్పులు నమోదు కాలేదు. రాష్ట్రంలో యేటా మే లో సాధారణం కంటే గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాడ్పులు వీచి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి.
అప్పుడప్పుడూ చల్లదనం..
ఏపీలో 2014–2019 మధ్య కాలంలో వడగాడ్పులు వీచాయి. గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించలేదు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పైగా ఈ ఏడాది మే లో రుతుపవనాల ముందస్తు సీజను ప్రభావంతో మధ్యమధ్యలో వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో అప్పుడప్పుడూ చల్లదనమూ పరచుకుంది. ఇలా మే నెల మండుటెండలు, వడగాడ్పులు లేకుండా ఊరటనిచ్చింది. గత కొన్నేళ్లలో మే లో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు తెలిపారు.
పశ్చిమ ఆటంకాల వల్లే..
మే నెలలో వడగాడ్పుల తీవ్రత లేకపోవడానికి ఉత్తర భారత్‌లో పశ్చిమ ఆటంకాలే (వెస్టర్న్ డిస్టర్బెన్స్–పశ్చిమం నుంచి తూర్పు దిశగా వీచే గాలుల) కారణం. వీటి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. సాధారణంగా ఇవి ఫిబ్రవరి, మార్చితో తగ్గుముఖం పడతాయి. కానీ ఏప్రిల్, మే వరకూ అక్కడ కొనసాగాయి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. అందుకే మే నెలలో రాష్ట్రం వైపు రాజస్థాన్, ఉత్తరాది నుంచి వేడి/వడగాలులు ఈసారి రాలేదు. మే నెలలో ఇలాంటి పరిస్థితి అరుదు.
– రాళ్లపల్లి మురళీకృష్ణ, ఐఎండీ రిటైర్డ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment