ఈ వేసవిలో 18 రోజులు హీట్‌వేవ్స్
సాధారణం కంటే మూడు రెట్లు అధికం
ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభం నుంచే ప్రతాపం
ఈ నెలలోనూ ప్రభావం
ఈ ఏడాది 48 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: గతేడాదిని మించి ఈ ఏడాది వడగాడ్పులు హడలెత్తించాయి. గతేడాది వేసవిలో 17 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచినట్టు నమోదైంది. అయితే ఈసారి వడగాడ్పుల సంఖ్య 18కి పెరిగింది. అంతేకాకుండా గతేడాది ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ఈ ఏడాది 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాది వేసవి దడ పుట్టించిందనుకుంటే ఈసారి అంతకు మించి హడలెత్తించింది. సాధారణం కంటే దాదాపు మూడు రెట్ల వడగాడ్పులతో జనాన్ని బెంబేలెత్తించింది.
ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ ఆరంభం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆ నెలలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. మే నెల రెండో వారం, మూడో వారంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉష్ణతాపాన్ని కాస్త తగ్గించాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత ఒకింత తగ్గినట్టు కనిపించింది. సాధారణంగా ఏప్రిల్, జూన్‌కంటే మే నెలలోనే వేసవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మే నెలలో వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్‌కంటే తక్కువ వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి.
ఏప్రిల్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను చూసి మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ మే నెల మధ్య మధ్యలో ఆవర్తనాలు, ద్రోణులు, తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకే పరిమితమయ్యాయి. ఇలా ఈ వేసవి మూడు నెలలూ 18 రోజుల పాటు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇందులో ఏప్రిల్‌లో ఎనిమిది రోజులు (5, 6, 7, 8, 24, 28, 29, 30 తేదీలు), మే నెలలో ఏడు రోజులు (1, 2, 3, 4, 5, 28, 31 తేదీలు), జూన్‌లో మూడు రోజులు (1, 17, 18 తేదీలు) వడగాడ్పులు ప్రభావం చూపాయి.
స్తబ్దుగా నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందుగా అటు కేరళలోకి, ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించినా అవి ఉత్తర కోస్తాలోకి విస్తరించాక దాదాపు పది రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో జూన్ మూడో వారం వర్షాలు కురవాల్సిన సమయంలో రెండు రోజుల (17, 18 తేదీల్లో) పాటు వడగాడ్పులు మళ్లీ చెలరేగాయి. ఈ దఫా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు దడ పుట్టించాయి.
ప్రధానంగా నంద్యాల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా వడగాడ్పులను ఎదుర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment