నేడు సముద్రంలోనే బలహీనపడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా వాయుగుండం ఏర్పడితే ఈదురు గాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ.. ఈసారి వాయుగుండమే అస్తవ్యస్తమవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దారి తప్పినట్టుగా మారి.. అటూఇటూ తిరుగుతూ ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ., విశాఖపటా్ననికి 430 కి.మీ., గోపాల్‌పూర్‌కి 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వారం రోజులపాటు అల్పపీడనంగానూ, తర్వాత వాయుగుండంగా బలపడిన సమయంలో గాలిలో తేమనంతటినీ లాగేసుకుంది. దీంతో సముద్రంలో మొత్తంగా పొడిగాలుల వాతావరణం ఏర్పడింది. తేమ గాలులు లేకపోవడంతో వాయుగుండం దిక్కుతోచని స్థితిలో పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు. ఇది తూర్పు ఈశాన్య దిశగా నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే శనివారం రాత్రి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం నాటికి మరింత బలహీనపడుతుందని, దీనిప్రభావం రాష్ట్రంపై ఇక ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment