నీళ్లురాక కట్టిపెట్టిన బోరుబావి
అనంతపురం అగ్రికల్చర్: కీలకమైన నైరుతి రుతుపవనాలతో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ ఏడాది ప్రభావం చూపకపోవడంతో వర్షం జాడ కరువైంది. తిత్లీ, ఫొణి లాంటి తీవ్రస్థాయి తుపాన్లు సంభవించినా.. జిల్లాలో కనీసం తుంపర్లు కూడా పడని పరిస్థితి. అడపాదడపా గాలి చినుకులు, అకాల వర్షాలు తప్ప భారీ వర్షం లేకపోయింది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 151 గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లా సగటు నీటి మట్టం 25 మీటర్లుగా నమోదైంది. పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తుండటంతో ఏకంగా 54 మండలాలు డేంజర్ జోన్‌లో ఉండగా.. మిగతా 9 మండలాలు మాత్రమే సేఫ్‌జోన్ ఉన్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.పురుషోత్తమరెడ్డి తెలిపారు. గతేడాది అంటే 2018 మే నెల విషయానికి వస్తే సగటు నీటి మట్టం 19.80 మీటర్లుగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే 5.23 మీటర్లు లోతుకు నీటి మట్టం పడిపోవడం గమనార్హం.
గాండ్లపెంటలో 90 మీటర్లలో పాతాళగంగ
జిల్లా సగటు నీటిమట్టం 25 మీటర్లుగా నమోదైనా.. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా క్షీణించింది. గాండ్లపెంటలో 90 మీటర్లు చూస్తే కానీ నీటిచుక్క కనిపించే పరిస్థితి లేదు. లేపాక్షి, తలుపుల, అమరాపురం, కంబదూరు, గుడిబండ, గుమ్మఘట్ట, సోమందేపల్లి, పెనుకొండ, కుందుర్పి, అగళి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, శెట్టూరు, రొద్దం, హిందూపురం,రామగిరి, ముదిగుబ్బ, పరిగి, తనకల్లు, పుట్టపర్తి, అనంతపురం, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, రాప్తాడు, ఎన్‌పీ కుంట.. ఇలా చాలా మండలాల్లో ఉన్న ఫీజోమీటర్లలో 40 నుంచి 80 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 151 ఫీజోమీటర్లను పరిశీలిస్తే అందులో 103 ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం ఆందోళన కలిగిస్తోంది.
43 శాతం లోటు వర్షపాతం: జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మి.మీ., కాగా అందులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 541 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. అయితే 308 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాధారణం కన్నా 43 మి.మీ., లోటు నమోదు కావడం గమనార్హం. గత 140 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయి లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. వర్షం, జలాల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఒక జూన్ నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగతా నెలల్లో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కొన్ని మండలాల్లో నెలల తరబడి వాన చినుకు పడలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీలో 250 పైగా వర్షపాతం విరామాలు(డ్రైస్పెల్స్) నమోదు కావడం వర్షాభావ తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేసిన పంటలన్నీ ఎండిపోయి రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా అపార నష్టాన్ని మిగిలింది.
ఎండుతున్న పండ్ల తోటలు: 43 శాతం లోటు వర్షాలు, సగటున 25 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం, వీటికి తోడుగా 42 నుంచి 44 డిగ్రీలతో భానుడు భగ్గుమంటుండటంతో పండ్లతోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అధికారిక అంచనాల మేరకు 5వేల ఎకరాల్లో మల్బరీ (పట్టు) తోటలు, 12వేల ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.30 లక్షల బోరుబావుల్లో దాదాపు 82వేల బోరుబావుల్లో నీళ్లు రాక ఒట్టిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో 42వేల హెక్టార్ల పండ్లతోటలు నీటిఎద్దడి బారిన పడ్డాయి. వాటిని కాపాడుకునేందుకు జిల్లా రైతులు భగీరథ యత్నాలు కొనసాగిస్తున్నారు. ఓ పక్క లక్షలకు లక్షలు అప్పులు చేసి కొత్తగా 500 నుంచి 800 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో వేయి అడుగుల వరకు బోరుబావులు తవ్విస్తున్నా 10 శాతం కూడా ఫలితం దక్కని పరిస్థితి ఉంది. మరోపక్క ట్యాంకర్లు పెట్టి కిలోమీటర్ల కొద్దీ నీళ్లు తరలించి తోటలకు ఇస్తున్నా బతికించుకోలేకపోతున్నారు.
విపత్తు సంభవిస్తుందని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఐదు, పదేళ్లు పెంచి పోషించిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి నెలకొంది. రక్షకతడులు (లైఫ్‌సేవింగ్ ఇరిగేషన్స్) ఇస్తామంటూ ఇటీవల ఉద్యానశాఖ ప్రకటించినా మొక్కుబడిగా సాగుతోంది. అలాగే పశుగ్రాసం సమస్య పట్టిపీడిస్తోంది. కొనడానికి కూడా దొరక్కపోవడంతో 10 లక్షల పశుసంపద, 48 లక్షల జీవసంపదను బతికించుకోవడం కష్టంగా మారింది. వేలాది సంఖ్యలో పాడి పశుసంపద కేరళ, తమిళనాడు, తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న కబేళాలకు తరలిస్తున్న దుస్థితి. మొత్తం మీద ఈ ఏడాది వేసవి ముగిసే నాటికి పట్టు, పాడి, పండ్లతోటల రైతులకు సుమారు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment