ground level water level
-
గొంతెండుతోంది
తిరుపతి అన్నమయ్య సర్కిల్: జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. 65శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటిమట్టం 50.21మీటర్ల దిగువకు పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 80శాతం బోర్లు ఎండిపోయాయి. పశ్చిమ మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో పడమర మండలాల్లో భూగర్భజలాలు 98 మీటర్ల దిగువకు చేరుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని 66 మండలాల్లో సుమారు 1,225 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య త్రీవంగా ఉంది. ప్రధానంగా 4 వేల గ్రామాలు నీటికోసం అల్లాడుతున్నాయి. గత ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యం వహించారు. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లతో, బోర్ల సహాయంతో అందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. బిందెలతో కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు 15రోజులకొకసారి ఒక ట్యాంకర్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం ఎక్కడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. కరువు కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. మాటలకే పరిమితమైన ప్రాజెక్టులు జిల్లాలో నీటి వనరులు ఆశించినంత మేర లేకపోవడం, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకుల అలసత్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అరణియార్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా తవ్వకాలతో పరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారాయి. ఈ క్రమంలో గ్రామీణులు సైతం తాగునీరు కొనుగోలు చేయకతప్పడం లేదు. గ్రామాల్లో చేతిపంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీటి మాఫియా ఆగడాలు జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించిన కొందరు గత ప్రభుత్వం అండదండలతో మాఫియాగా ఏర్పడి కోట్లలో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో, స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాలలో విచ్చలవిడిగా బోర్లు వేసి కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 200వరకు బోర్లు వేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు మామూళ్ల మత్తులో పడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ నీటికి రూ.800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.5 నుంచి 6కోట్ల వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోనే రోజుకు రూ.2 నుంచి 3కోట్ల వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ నుంచి క్యాన్ వాటర్ రూ.30 జిల్లాలో తాగునీటి సమస్య తారస్థాయికి చేరడంతో ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నగరాల్లో ప్రతి సందులోనూ వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20లీటర్ల వాటర్ క్యాన్ రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తున్నారు. దీన్ని జూన్ ఒకటో తేదీ నుంచి రూ.30కి పెంచాలని వాటర్‌ప్లాంట్ అసోసియేషన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే సామాన్యులు తాగునీరు కొనలేని పరిస్థితి. గత ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2కే 20లీటర్ల నీరు అంటూ ఆర్భాటంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. సమగ్రంగా అమలు చేయకపోవడంతో ప్రారంభంలోనే నీరుగారిపోయింది. -
కన్నీటి గంగమ్మ!
అనంతపురం అగ్రికల్చర్: కీలకమైన నైరుతి రుతుపవనాలతో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ ఏడాది ప్రభావం చూపకపోవడంతో వర్షం జాడ కరువైంది. తిత్లీ, ఫొణి లాంటి తీవ్రస్థాయి తుపాన్లు సంభవించినా.. జిల్లాలో కనీసం తుంపర్లు కూడా పడని పరిస్థితి. అడపాదడపా గాలి చినుకులు, అకాల వర్షాలు తప్ప భారీ వర్షం లేకపోయింది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 151 గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లా సగటు నీటి మట్టం 25 మీటర్లుగా నమోదైంది. పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తుండటంతో ఏకంగా 54 మండలాలు డేంజర్ జోన్లో ఉండగా.. మిగతా 9 మండలాలు మాత్రమే సేఫ్‌జోన్ ఉన్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.పురుషోత్తమరెడ్డి తెలిపారు. గతేడాది అంటే 2018 మే నెల విషయానికి వస్తే సగటు నీటి మట్టం 19.80 మీటర్లుగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే 5.23 మీటర్లు లోతుకు నీటి మట్టం పడిపోవడం గమనార్హం. గాండ్లపెంటలో 90 మీటర్లలో పాతాళగంగ జిల్లా సగటు నీటిమట్టం 25 మీటర్లుగా నమోదైనా.. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా క్షీణించింది. గాండ్లపెంటలో 90 మీటర్లు చూస్తే కానీ నీటిచుక్క కనిపించే పరిస్థితి లేదు. లేపాక్షి, తలుపుల, అమరాపురం, కంబదూరు, గుడిబండ, గుమ్మఘట్ట, సోమందేపల్లి, పెనుకొండ, కుందుర్పి, అగళి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, శెట్టూరు, రొద్దం, హిందూపురం,రామగిరి, ముదిగుబ్బ, పరిగి, తనకల్లు, పుట్టపర్తి, అనంతపురం, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, రాప్తాడు, ఎన్పీ కుంట.. ఇలా చాలా మండలాల్లో ఉన్న ఫీజోమీటర్లలో 40 నుంచి 80 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 151 ఫీజోమీటర్లను పరిశీలిస్తే అందులో 103 ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం ఆందోళన కలిగిస్తోంది. 43 శాతం లోటు వర్షపాతం: జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మి.మీ., కాగా అందులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 541 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. అయితే 308 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాధారణం కన్నా 43 మి.మీ., లోటు నమోదు కావడం గమనార్హం. గత 140 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయి లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. వర్షం, జలాల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఒక జూన్ నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగతా నెలల్లో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కొన్ని మండలాల్లో నెలల తరబడి వాన చినుకు పడలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీలో 250 పైగా వర్షపాతం విరామాలు(డ్రైస్పెల్స్) నమోదు కావడం వర్షాభావ తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేసిన పంటలన్నీ ఎండిపోయి రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా అపార నష్టాన్ని మిగిలింది. ఎండుతున్న పండ్ల తోటలు: 43 శాతం లోటు వర్షాలు, సగటున 25 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం, వీటికి తోడుగా 42 నుంచి 44 డిగ్రీలతో భానుడు భగ్గుమంటుండటంతో పండ్లతోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అధికారిక అంచనాల మేరకు 5వేల ఎకరాల్లో మల్బరీ (పట్టు) తోటలు, 12వేల ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.30 లక్షల బోరుబావుల్లో దాదాపు 82వేల బోరుబావుల్లో నీళ్లు రాక ఒట్టిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో 42వేల హెక్టార్ల పండ్లతోటలు నీటిఎద్దడి బారిన పడ్డాయి. వాటిని కాపాడుకునేందుకు జిల్లా రైతులు భగీరథ యత్నాలు కొనసాగిస్తున్నారు. ఓ పక్క లక్షలకు లక్షలు అప్పులు చేసి కొత్తగా 500 నుంచి 800 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో వేయి అడుగుల వరకు బోరుబావులు తవ్విస్తున్నా 10 శాతం కూడా ఫలితం దక్కని పరిస్థితి ఉంది. మరోపక్క ట్యాంకర్లు పెట్టి కిలోమీటర్ల కొద్దీ నీళ్లు తరలించి తోటలకు ఇస్తున్నా బతికించుకోలేకపోతున్నారు. విపత్తు సంభవిస్తుందని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఐదు, పదేళ్లు పెంచి పోషించిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి నెలకొంది. రక్షకతడులు (లైఫ్‌సేవింగ్ ఇరిగేషన్స్) ఇస్తామంటూ ఇటీవల ఉద్యానశాఖ ప్రకటించినా మొక్కుబడిగా సాగుతోంది. అలాగే పశుగ్రాసం సమస్య పట్టిపీడిస్తోంది. కొనడానికి కూడా దొరక్కపోవడంతో 10 లక్షల పశుసంపద, 48 లక్షల జీవసంపదను బతికించుకోవడం కష్టంగా మారింది. వేలాది సంఖ్యలో పాడి పశుసంపద కేరళ, తమిళనాడు, తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న కబేళాలకు తరలిస్తున్న దుస్థితి. మొత్తం మీద ఈ ఏడాది వేసవి ముగిసే నాటికి పట్టు, పాడి, పండ్లతోటల రైతులకు సుమారు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా. -
ఆగ‘మేఘా’లమీద రావమ్మా..
సాధారణం కన్నా 11.8 శాతం తక్కువ వర్షపాతం నమోదు 32 మండలాల్లో జీరో శాతం వర్షం నమోదు అడుగంటుతున్న భూ గర్భ జలాలు వాన రాకకోసం జనం ఎదురుచూపులు చినుకమ్మా... వాన చినుకమ్మా నేల సిన్నబోయి సూడు బతుకమ్మా మేఘాలపై దాగుండిపోకమ్మా ఆగ మేఘాల మీద రావమ్మా కంటిమీద కునుకు లేదమ్మా పల్లె కన్నీరు పెడుతోంది చూడమ్మా ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి కుండపోతగా కురిసిపోవమ్మా... అంటూ జిల్లా ప్రజలు వాన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఇటు తాగుకు... అటు సాగుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అమలాపురం : ఈ ఫొటో చూశారా? అంబాజీపేట మండలం తొండవరంలోని ఒక కొబ్బరితోటలోని మోటారు. వైనతేయ నదీ తీరానికి అర కిలో మీటరు దూరంలో ఉంది. దీని సామర్ధ్యం నాలుగు అంగుళాలు కాగా కేవలం రెండు అంగుళాలు మాత్రమే నీరు వస్తోంది. భూ గర్భ జలాలు అడుగంటడంతో నీటి ఉరవడి తగ్గిందని రైతు వాపోతున్నాడు. 10 నుంచి 12 గంటల సమయం తోడితే ఎకరాకు సంమృద్ధిగా నీరందించే అవకాశముండగా ఇప్పుడు రెట్టింపు సమయం పడుతోంది. ఇక్కడే కాదు.. అనావృష్టి పరిస్థితుల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మెట్ట.. ఏజెన్సీ.. డెల్టా.. కోనసీమ అనే తేడా లేదు.. అన్నిచోట్ల ఇదే స్థితి. మెట్ట ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల చొప్పున డెల్టాలో మూడు నుంచి ఐదు అడుగుల చొప్పున భూగర్భ జలాలు అడుగంటాయని అంచనా. ఈ ప్రాంతాల్లో లోటు వర్షం ఇలా... జిల్లాలో ఈసారి మెట్ట, ఏజెన్సీ, డెల్టా అనే తేడా లేదు. ఆయా ప్రాంతాల్లో పలు మండలాల్లో లోటు వర్షం కురిసింది. జూ¯ŒS ఒకటి నుంచి మార్చి 15 వరకు పరిశీలిస్తే...ఈ మండలాల్లో లోటు వర్షం నమోదయింది. మెట్టలో : రాజవొమ్మంగి, తుని, తొండంగి, రౌతులపూడి, గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, సీతానగరం, కోరుకొండ, గోకవరం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, కొత్తపల్లి, సామర్లకోట, రంగంపేట, గెద్దనాపల్లి, రాజానగరం. డెల్టాలో : కాకినాడ రూరల్, అర్బన్, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, మండపేట, పెదపూడి, కరప, తాళ్లరేవు, కాజులూరు, రామచంద్రపురం, రాయవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు. కోనసీమలో : ఆత్రేయపురం, రావులపాలెం, కె.గంగవరం (పామర్రు), కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్ల వరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో లోటు వర్షం నమోదయింది. మెట్టలో కోటనందూరు, రౌతలపూడి, కోరుకొండ, ప్రత్తిపాడు వంటి మండలాల్లో గడిచిన మూడేళ్లుగా లోటు వర్షం పడుతోంది. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ప్రస్తుత వేసవిలో పడరానిపాట్లు పడుతున్నారు. ఈ ఏడాది కూడా సాధారణ వర్షమే అంటున్నా.. లోటు వర్షం తప్పదని రైతుల ఆందోళన. అదే జరిగితే మెట్టలో బోరుబావులపై వ్యవసాయం ముందుకు సాగదని వాపోతున్నారు. జలాలు అడుగంటడంతో తోటల్లో.. పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మెట్టలో గంటకు మించి నీరు రాని పరిస్థితి నెలకొనగా..కోనసీమలో తోటలు తడిసేందుకు రెట్టింపు సమయం పడుతోంది.