- సాధారణం కన్నా 11.8 శాతం తక్కువ వర్షపాతం నమోదు
- 32 మండలాల్లో జీరో శాతం వర్షం నమోదు
- అడుగంటుతున్న భూ గర్భ జలాలు
- వాన రాకకోసం జనం ఎదురుచూపులు
ఆగ‘మేఘా’లమీద రావమ్మా..
Published Sat, Apr 29 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM
చినుకమ్మా... వాన చినుకమ్మా
నేల సిన్నబోయి సూడు బతుకమ్మా
మేఘాలపై దాగుండిపోకమ్మా
ఆగ మేఘాల మీద రావమ్మా
కంటిమీద కునుకు లేదమ్మా
పల్లె కన్నీరు పెడుతోంది చూడమ్మా
ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి
కుండపోతగా కురిసిపోవమ్మా... అంటూ జిల్లా ప్రజలు వాన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఇటు తాగుకు... అటు సాగుకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
అమలాపురం :
ఈ ఫొటో చూశారా? అంబాజీపేట మండలం తొండవరంలోని ఒక కొబ్బరితోటలోని మోటారు. వైనతేయ నదీ తీరానికి అర కిలో మీటరు దూరంలో ఉంది. దీని సామర్ధ్యం నాలుగు అంగుళాలు కాగా కేవలం రెండు అంగుళాలు మాత్రమే నీరు వస్తోంది. భూ గర్భ జలాలు అడుగంటడంతో నీటి ఉరవడి తగ్గిందని రైతు వాపోతున్నాడు. 10 నుంచి 12 గంటల సమయం తోడితే ఎకరాకు సంమృద్ధిగా నీరందించే అవకాశముండగా ఇప్పుడు రెట్టింపు సమయం పడుతోంది. ఇక్కడే కాదు.. అనావృష్టి పరిస్థితుల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మెట్ట.. ఏజెన్సీ.. డెల్టా.. కోనసీమ అనే తేడా లేదు.. అన్నిచోట్ల ఇదే స్థితి. మెట్ట ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల చొప్పున డెల్టాలో మూడు నుంచి ఐదు అడుగుల చొప్పున భూగర్భ జలాలు అడుగంటాయని అంచనా.
ఈ ప్రాంతాల్లో
లోటు వర్షం ఇలా...
జిల్లాలో ఈసారి మెట్ట, ఏజెన్సీ, డెల్టా అనే తేడా లేదు. ఆయా ప్రాంతాల్లో పలు మండలాల్లో లోటు వర్షం కురిసింది. జూ¯ŒS ఒకటి నుంచి మార్చి 15 వరకు పరిశీలిస్తే...ఈ మండలాల్లో లోటు వర్షం నమోదయింది.
మెట్టలో : రాజవొమ్మంగి, తుని, తొండంగి, రౌతులపూడి, గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, సీతానగరం, కోరుకొండ, గోకవరం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, కొత్తపల్లి, సామర్లకోట, రంగంపేట, గెద్దనాపల్లి, రాజానగరం.
డెల్టాలో : కాకినాడ రూరల్, అర్బన్, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, మండపేట, పెదపూడి, కరప, తాళ్లరేవు, కాజులూరు, రామచంద్రపురం, రాయవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు.
కోనసీమలో : ఆత్రేయపురం, రావులపాలెం, కె.గంగవరం (పామర్రు), కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్ల వరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో లోటు వర్షం నమోదయింది.
మెట్టలో కోటనందూరు, రౌతలపూడి, కోరుకొండ, ప్రత్తిపాడు వంటి మండలాల్లో గడిచిన మూడేళ్లుగా లోటు వర్షం పడుతోంది. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ప్రస్తుత వేసవిలో పడరానిపాట్లు పడుతున్నారు. ఈ ఏడాది కూడా సాధారణ వర్షమే అంటున్నా.. లోటు వర్షం తప్పదని రైతుల ఆందోళన. అదే జరిగితే మెట్టలో బోరుబావులపై వ్యవసాయం ముందుకు సాగదని వాపోతున్నారు. జలాలు అడుగంటడంతో తోటల్లో.. పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మెట్టలో గంటకు మించి నీరు రాని పరిస్థితి నెలకొనగా..కోనసీమలో తోటలు తడిసేందుకు రెట్టింపు సమయం పడుతోంది.
Advertisement
Advertisement