ఆత్మకూరులో ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
ఎండలు మండిపోతున్నాయి.. భూమి సెగలు కక్కుతోంది. కాలు కింద పెడితే భగ్గుమంటోంది. పార పట్టుకుంటే బొబ్బలొస్తున్నాయి..కాసింత సేపు సేదదీరుదామంటే నీడకూడా కరువు..దాహమేసినా ఇంటినుంచి తెచ్చుకున్న నీళ్లే గతి. మజ్జిగ చుక్కకూ మంగళం పాడారు. ఎండకు కళ్లు తిరిగినా.. చిన్న గాయమైనా మందులు అందుబాటులో లేక ఆస్పత్రికి పరుగు తీయాల్సిన పరిస్థితి. అయినా నాలుగు వేళ్లు నోట్లో వెళ్లేందుకు నిరుపేదలంతా ‘ఉపాధి’ బాట పట్టారు. కనీస సౌకర్యాలు లేకపోయినా రక్తాన్ని స్వేదంగా మార్చి బతుకుపోరు సాగిస్తున్నారు. కనీస సౌకర్యాల కోసం కేంద్రమే డబ్బులిస్తున్నా.. అవన్నీ దిగమింగుతున్న సిబ్బంది ‘ఉపాధి’ కూలీలకు నరకం చూపుతున్నారు.
అనంతపురం టౌన్ : రోజురోజుకూ భానుడు మండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. స్థానికంగా వ్యవసాయ పనులేవీ లేవు. దీంతో నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అయితే పనులు చేసే చోట వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో కూలీలు పనుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు జిల్లాలో 7,85,227 లక్షలు ఉండగా.. 18.23 లక్షల మంది ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కూలీలు పని చేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూలీలు ఎండల్లో పనిచేసేందుకు భయపడుతున్నారు.
నీడలేదు...మందులు కరువు
ఉపాధి పనులు చేసే ప్రదేశంలో ఎక్కడా టెంట్లు లేవు.. ఎండలోనే ఉపాధి కూలీలు పనులు చేస్తూ ఎండవేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలకు విధిగా మజ్జిగ, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా...అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఉపాధి కూలీలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా... అవి మాత్రం పని ప్రదేశంలో ఎక్కడ కనిపించడంలేదు. కొన్ని ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం అందజేసిన మెడికల్ బాక్సులనే వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్ మినహా అన్ని కాలం చెల్లడంతో ఎక్కడ కూడా ప్రథమ చికిత్సా బాక్సులను వినియోగించడం లేదు.
రోజురోజుకూ పడిపోతున్న హాజరు శాతం
భానుడి భగభగ మంటున్నా...అధికారులు ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే రోజుకు లక్ష మందికి పైగా ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ..హాజరు శాతం దారుణంగా పడిపోయింది.
వసతులు కల్పించకుంటే చర్యలు : జ్యోతిబసు, డ్వామా పీడీ
పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు అన్ని రకాల వసతులు కల్పించాలి. విధిగా టెంట్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో నీడ కల్పించే దిశగా ఏపీఓలు చొరవ చూపాలి. కూలీలకు వసతులు కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment