
శాన్ ఫ్రాన్సిస్కో: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు బుధవారం భారీగా పతనమైంది. ఒక దశలో ఏకంగా 39 శాతం క్షీణించి 212.51 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. దశాబ్ద కాలంలోనే తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో యూజర్లపరంగా భారీ ఎదురుదెబ్బ తగలడం ఇందుకు కారణం. సమీక్షాకాలంలో కొత్తగా 25 లక్షల మంది యూజర్లు చేరతారని అంచనా వేసుకోగా .. దానికి విరుద్ధంగా నికరంగా 2,00,000 మంది సబ్‌స్క్రయిబర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పోగొట్టుకుంది.
ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనగా రష్యా మార్కెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మరో 20 లక్షల మంది దాకా యూజర్లను కోల్పోయే అవకాశం ఉందన్న నెట్‌ఫ్లిక్స్ అంచనాలు.. షేర్‌హోల్డర్లను కలవరపరుస్తున్నాయి. దీంతో షేరు భారీగా పతనమైంది. కంపెనీ పనితీరుపై సందేహాలతో గత నాలుగు నెలల్లో 150 బిలియన్ డాలర్ల మేర షేర్‌హోల్డర్ల సంపద కరిగిపోయింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీ యూజర్ల సంఖ్య 22.16 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment