
గొంగ్లూర్ శివారులో నాణ్యత లేకుండా నిర్మించడంతో కూలిన కల్వర్టు
- మంత్రి పర్యవేక్షిస్తున్నా నాసిరకం పనులే
- కూలుతున్న సింగూర్ వరద కాల్వలు
పుల్‌కల్: ఎలాగైనా సింగూర్ వరద కాల్వ పనులను ఈసారి పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్వయంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాల్వ పనుల ప్రగతి నివేదికను వాట్సాప్ ద్వారా తనకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేయాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ రావుతో పాటు ఎస్‌ఈ సురేందర్‌ను ఆదేశించారు.
అందుకు అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు సింగూర్ వరద కాల్వ పనులను వేగవంతం చేయడంతోపాటు పర్యవేక్షిస్తున్నారు. కానీ అధికారులు వాహనాలు వెళ్లే ప్రాంతాల్లోనే జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతంతోపాటు పంట పొలాల్లో జరిగే పనులను మాత్రం అధికారులు పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నారు.
ఇదేం క్యూరింగ్?
సీసీ పనులు చేసిన ప్రతి చోటా కచ్చితంగా నీటితో క్యూరింగ్ చేయాలనే ఆదేశాలు ఉన్నా నీరు అందుబాటులో లేదనే సాకుతో నీరు పోయకుండానే వదిలేస్తున్నారు. దీంతో నిర్మించిన వెంటనే మట్టికుప్పల్లా విరిగిపోతున్నాయి. దీనికి పుల్‌కల్ మండల పరిధిలోని గొంగ్లూర్ శివారులో గతవారం నిర్మించిన కల్వర్టు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ కల్వర్టును నాసిరకంగా నిర్మించడంతో అప్పుడే కూలిపోయింది. అదే కల్వర్టుకు కింది భాగంతోపాటు పైవరకూ పూర్తిగా బీటలు వారిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పుల్‌కల్ శివారులోని చిట్టెం చెరువు సమీపంలో ఇసుకతో కాకుండా రాతి పౌడర్‌తో నిర్మించడంతో పగుళ్లు వచ్చి పెచ్చులూడుతున్నాయి.
పట్టించుకోని అధికారులు
సింగూర్ వరద కాల్వలను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రతి సందర్భంలో సింగూర్ వరద కాల్వల నిర్మాణంలో నిర్లక్ష్యం చేసినా, నాసిరకంగా పనులు చేసి నిర్మించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించినా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు.
ఈ విషయంపై సింగూర్ డిప్యూటీ ఇంజనీర్ జగన్నాథంను వివరణ కోరగా కల్వర్టులు నాసిరకంగా నిర్మించడ వల్ల కూలడం లేదని, నీరు లేకపోవడంతో క్యూరింగ్ చేయడం లేదని, అందుకే ఎండ తీవ్రతకు బీటలు వారుతున్నాయని వివరణ ఇచ్చారు. అడవుల్లో నీరు అందుబాటులో లేనందునే క్యూరింగ్ చేయడం లేదని చెబుతున్న మాటలనుబట్టి కాంట్రాక్టర్లతో అధికారులు ఎలా కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవచ్చు.