ముంబై: ఇంట్రాడేలో పరిమిత శ్రేణిలో ట్రేడైన సూచీలు బుధవారం చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్లను కోల్పోయి 58,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు పతనమైన 17,547 వద్ద నిలిచింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(బుధవారం రాత్రి)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అంచనాలను ఒక శాతం తగ్గించి పదిశాతానికి పరిమితం చేసింది.
ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 300 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 86 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. సోనీ పిక్చర్స్ – జీ ఎంటర్‌టైన్‌మెంట్ వీలీన ఒప్పందం నేపథ్యంలో మీడియా షేర్లు పరుగులు పెట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మీడియా ఇండెక్స్ 14 శాతం ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడంతో రియల్టీ రంగ షేర్లకు కలిసొచ్చింది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఎనిమిదిన్నర శాతం లాభపడింది.
ఎవర్‌గ్రాండే సంక్షోభం ఓ కొలిక్కిరావడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆటో రంగ షేర్లూ లాభాల బాట పట్టాయి. చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే బాండ్లపై కొంత వడ్డీని చెల్లించేందుకు అంగీకారం తెలపడంతో డిఫాల్ట్ ఆందోళనలు తగ్గాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్ స్టాక్ సూచీలు నష్టాల్లో ముగియగా, మిగిలిన అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకశాతం పెరగ్గా, అమెరికా ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,943 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,850 కోట్ల షేర్లను కొన్నారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు ...
► వాణిజ్య వాహన ధరలను పెంచడంతో టాటా మోటార్స్ కంపెనీ షేరు మూడుశాతం పెరిగి రూ.310 వద్ద ముగిసింది.
► నోయిడాలోని తన లగ్జరీ ప్రాపరీ్టని రూ.575 కోట్లకు విక్రయించడంతో గోద్రెజ్ ప్రాపరీ్టస్ లిమిటెడ్ షేరు 13 శాతం లాభపడి రూ.1950 వద్ద స్థిరపడింది.
► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలతో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు వరుసగా 1.50%, ఒకశాతం చొప్పున క్షీణించాయి.
ఫెడ్ రేటు యథాతథం
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్– ఫెడ్ ఫండ్ రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. దీనితో ఈ రేటు 0.00–0.25 శ్రేణిలో ఇకముందూ కొనసాగనుంది. 2021లో ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతం నుంచి 4.2కు పెంచినప్పటికీ, అమెరికా ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితి పూర్తిగా తొలగని నేపథ్యంలో యథాతథ రేట్ల కొనసాగింపునకే ఫెడ్ ఏకగ్రీవంగా మొగ్గుచూపింది.
Comments
Please login to add a commentAdd a comment