Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్‌ | Stock market: Sensex, Nifty 50 extend gains into third straight session | Sakshi
Sakshi News home page

Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్‌

Published Fri, Feb 16 2024 6:33 AM | Last Updated on Fri, Feb 16 2024 6:33 AM

Stock market: Sensex, Nifty 50 extend gains into third straight session - Sakshi

ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.

ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954  శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

బీఎస్‌ఈలో స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్‌ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్‌ 2.61%, యుటిలిటీస్‌ 2.59%, పవర్‌ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.


► డిసెంబర్‌ క్వార్టర్‌ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్,
► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్‌ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు  బీఎస్‌ఈలో 5% లోయర్‌ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది.
► ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది.  
►  బ్లాక్‌డీల్‌ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి
రూ.268 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement