ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.
అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది.
ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు
ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి.
‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు.
► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్‌ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది.
► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది.
► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్‌డీఎఫ్‌సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment