Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు | Sensex Nifty End With Minor Gains After Volatile Session | Sakshi
Sakshi News home page

Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు

Published Fri, Apr 21 2023 12:42 AM | Last Updated on Fri, Apr 21 2023 12:42 AM

Sensex Nifty End With Minor Gains After Volatile Session - Sakshi

ముంబై: ట్రేడింగ్‌ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్‌ సెషన్‌ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.  

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్‌ దిగ్గజం ఎంకే గ్లోబల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ షేరు 20 శాతం అప్పర్‌
సర్క్యూట్‌తో రూ.80 వద్ద లాకయ్యింది.  
► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement