20 శాతం తగ్గిన మొబైల్స్‌ ఉత్పత్తి | Mobile Phone Production Capacities Down by Upto 20 percent | Sakshi
Sakshi News home page

20 శాతం తగ్గిన మొబైల్స్‌ ఉత్పత్తి

Published Thu, Apr 27 2023 4:47 AM | Last Updated on Thu, Apr 27 2023 4:47 AM

Mobile Phone Production Capacities Down by Upto 20 percent - Sakshi

కోల్‌కత: మొబైల్స్‌ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్‌–డిసెంబర్‌లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్‌ఫోన్స్‌ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్‌లో అతిపెద్ద మొబైల్స్‌ రిటైలర్‌ అయిన రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది.  

ప్రపంచవ్యాప్తంగా క్షీణత..
కేవలం భారత్‌లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గడంతో మొబైల్‌ ఫోన్‌ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్‌తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేస్తున్న జైనా గ్రూప్‌ ఎండీ ప్రదీప్‌ జైన్‌ తెలిపారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్‌ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో మొబైల్స్‌ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్‌పాయింట్‌ రిసర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ వివరించారు.  
పది వారాల నిల్వలు..
ప్రస్తుతం చాలా బ్రాండ్స్‌ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్‌ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్‌ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌–జూలై, నవంబర్‌–డిసెంబర్‌లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్‌ డిమాండ్‌ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్‌ పార్టీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఎండీ అతుల్‌ బి లాల్‌ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్‌సెట్స్‌ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement