Mobiles manufacturing hub
-
20 శాతం తగ్గిన మొబైల్స్ ఉత్పత్తి
కోల్‌కత: మొబైల్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్‌ఫోన్స్ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్‌లో అతిపెద్ద మొబైల్స్ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణత.. కేవలం భారత్‌లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో మొబైల్ ఫోన్ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్‌తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేస్తున్న జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో మొబైల్స్ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు. పది వారాల నిల్వలు.. ప్రస్తుతం చాలా బ్రాండ్స్ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–జూలై, నవంబర్–డిసెంబర్లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్ డిమాండ్ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ బి లాల్ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్‌సెట్స్‌ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. -
స్మార్ట్ ఫోన్స్ తయారీకి చిప్‌ల కొరత
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి 48,000 కోట్లతో భారత ప్రభుత్వం మూడు పథకాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 10.5 లక్షల కోట్ల రూపాయల మొబైల్ ఫోన్ల తయారీ కోసం పీఎల్ఐ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 16 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గత అక్టోబర్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.11 వేల కోట్లను కూడా విడుదల చేసింది. తాజాగా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కింద ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారుచేసే కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు అని ప్రభుత్వానికి పేర్కొన్నాయి.(చదవండి: అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్) మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ(ఐసీఇఎ)లో సభ్యులైన ఆపిల్, ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ మరియు లావా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఐటి కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీకి డిసెంబర్ 24న ఒక లేఖ రాసాయి. అందులో కోవిడ్ -19 చేత సరఫరా పరిమితులతో ఏర్పడిన కొరత కారణంగా పీఎల్ఐ పథకం కింద గతంలో విధించుకున్న లక్ష్యాలను చేరుకోక పోవచ్చని తెలిపాయి. "పీఎల్ఐ పథకం కింద చేరిన కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో చాలా కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కాదని" ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ లేఖలో తెలిపారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఎ) గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతకు కారణాలను వివరించింది. చైనా టెక్నాలజీ దిగ్గజం "హువావే" సంస్థ ఎలక్ట్రానిక్ చిప్స్, ప్రాసెసర్ల సరఫరాపై గత సెప్టెంబర్ లో అమెరికా నిషేధం విధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హువావే 2 సంవత్సరాలకు సరిపడా చిప్‌లను దిగుమతి చేసుకుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చిప్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. దింతో వివిధ దేశాలకు చెందిన సంస్థలు 97 శాతం సరఫరా భారత దేశ తయారీ కంపెనీలకు నిలిపివేశాయని మోహింద్రూ చెప్పారు. అంతర్జాతీయ విమాన నిషేధంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ఇష్యూ కారణంగా పీఎల్ఐ పథకం ప్రారంభించడానికి నాలుగు నెలల ముందు పలు కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఐసీఇఎ తెలిపింది. పీఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకం కోసం కాలపరిమితులను సర్దుబాటు చేయాలని పరిశ్రమల సంఘం కోరింది. -
నెలకు 60 లక్షల మొబైల్స్ తయారీ
* రేణిగుంట మొబైల్స్ హబ్‌లో 8 కంపెనీలకు 122 ఎకరాలు * భారత్‌లో హెడ్‌సెట్స్ తయారీ తొలి ప్లాంటు కూడా... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తున్న మొబైల్స్ తయారీ హబ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 122 ఎకరాలు కేటాయించింది. సెల్కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ కంపెనీలు యాంకర్ యూనిట్లుగా ఈ హబ్ ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ హబ్‌లో యాంకర్ కంపెనీలన్నీ కలిపి నెలకు 60 లక్షల మొబైల్స్ తయారు చేయనున్నట్లు తెలిసింది. మొబైల్ యాక్సెసరీస్ తయారీలో ఉన్న నాలుగు కంపెనీలు ఈ హబ్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. 8 కంపెనీలూ కలిసి రూ.2,000 కోట్ల దాకా పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. దీనిద్వారా నాలుగేళ్లలో 45,000 మందికి ఉపాధి లభించనుందని, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ హబ్ అభివృద్ధికి ఎకరాకు రూ.50 లక్షలు సమకూర్చనుందని తెలియవచ్చింది. దీనికి దసరా రోజున (22న) ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. తొలిసారిగా హెడ్‌సెట్స్ తయారీ.. మొబైల్స్ హబ్‌లో గ్వాంగ్డాంగ్ వివ్టెక్ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో హెడ్‌సెట్స్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హెడ్‌సెట్స్ తయారీకి సంబంధించి ఇండియాలో తొలి ప్లాంటు ఇదే కావటం గమనార్హం. మొబైల్ హ్యాండ్‌సెట్‌లో వాడే స్పీకర్ల తయారీకి హుయిచెన్స్ అకౌస్టిక్స్ సంస్థ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యాక్సిమ్ సంస్థ చార్జర్ల తయారీ చేపడుతుంది. హబ్‌లో ఉన్న మొబైల్స్ కంపెనీలకు యాక్సెసరీస్‌ను సరఫరా చేస్తే వీటికి వ్యాట్ మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుతం యాక్సెసరీస్‌పై వ్యాట్ 14 శాతముంది. క్వాల్కామ్, మీడియాటెక్ వంటి కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇవి గనక ఈ హబ్‌లోనే ఏర్పాటైతే మొబైల్స్ కంపెనీలకు బాగా కలిసొస్తుంది. ఆరు నెలల్లో తొలి ఉత్పాదన.. ఆరు నెలల్లో ఈ ప్లాంటు నుంచి తొలి ఉత్పాదనను బయటకు తెస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. నెలకు 10 లక్షల ఫోన్లను తయారు చేస్తామన్నారు. ముందుగా ట్యాబ్లెట్లు తయారు చేస్తామని, ఫోన్లను రిలయన్స్ జియోకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తామని చెప్పారు. ‘ప్లాంటు కోసం 20 ఎకరాలు తీసుకుంటున్నాం. 200 కోట్లు పెట్టుబడి పెడతాం. హబ్‌లో ట్రైనింగ్ కేంద్రం, క్వాలిటీ కంట్రోల్ తోపాటు కామన్ ఫెసిలిటీలుంటాయి. 80 శాతం ఉపాధి అవకాశాలు టెన్త్, ఇంటర్ చదివినవారికే ఉంటాయి. పాలిటెక్నిక్ అభ్యర్థులకూ ఉద్యోగాలుంటాయి. వీరందరికీ ఇక్కడే శిక్షణ ఇస్తాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు చైనాలో శిక్షణ ఇప్పిస్తాం. హబ్ ఏర్పాటుతో చిత్తూరు, కడప, నెల్లూరు యువతకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని వివరించారు. అనుభవం లేకున్నా అభ్యర్థి సామర్థ్యాన్నిబట్టి వివిధ విభాగాల్లో విధులు అప్పగిస్తామన్నారు. మెరుగైన పెట్టుబడి వాతావరణం: ఐసీఏ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాతోపాటు ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌టీటీఎఫ్) ఏర్పాటుతో మొబైల్స్, విడిభాగాల తయారీలో పెట్టుబడుల వాతావరణం మెరుగైందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) వెల్లడించింది. దేశ, విదేశీ కంపెనీలు కొన్ని ఇప్పటికే భారత్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. మరిన్ని రానున్నాయని ఐసీఏ ప్రెసిడెంట్, ఎఫ్‌టీటీఎఫ్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. రేణిగుంటలో మొబైల్స్ తయారీ హబ్ ఏర్పాటుతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. 2019 నాటికి భారత్‌లో రూ.3 లక్షల కోట్ల విలువైన 50 కోట్ల యూనిట్ల హ్యాండ్సెట్ల ఉత్పత్తి, 15 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్టీటీఎఫ్ను ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో ఈ హబ్ ద్వారా 75,000 మందికి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. 2014-15తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ 110 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పంకజ్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
-
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
⇒ 1,000 ఎకరాలిచ్చేందుకు ప్రభుత్వం ఓకే ⇒ ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్ రెడీ ⇒ ఆసక్తి చూపుతున్న మరిన్ని కంపెనీలు సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) భాగ్యనగరిపై మొగ్గు చూపుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హబ్‌ను ప్రతిపాదించగా దానికి పూర్తి మద్దతిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే భారత్‌లో మొబైల్స్ తయారీకి తొలి కేంద్రంగా హైదరాబాద్ నిలువనుంది. హబ్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్‌తోపాటు చైనాకు చెందిన రెండు మూడు కంపెనీలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని సీఎంను కలిసిన అనంతరం సెల్కాన్ సీఎండీ వై.గురు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఐసీఏ చొరవతో.. భారత్‌లో మొబైల్స్ తయారీకి హబ్ ఉండాలన్న తలంపుతో కొన్ని నెలలుగా ఐసీఏ తీవ్రంగా యత్నిస్తోంది. ఇందుకు సహకరించాలని పలు రాష్ట్రాలను సంప్రదించింది. మేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును సైతం కంపెనీల ప్రతినిధులు కలిశారు. మంగళవారం ఇదే విషయమై కేసీఆర్‌ను ఐసీఏ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ, సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ, ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫూల్జే, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని కలిశారు. హబ్ వస్తే 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు సీఎంకు తెలిపారు. ఐసీఏ ప్రతిపాదనను స్వాగతిస్తూ హైదరాబాద్ ప్రాంత విశిష్టతలను, రానున్న రోజుల్లో తెలంగాణ రూపురేఖలు ఏ విధంగా మారనున్నాయో ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రాయితీల్ని తామిస్తామని స్పష్టం చేశారు. ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతోనూ ఐసీఏ ప్రతినిధులు చర్చించారు. హబ్ కార్యరూపం దాల్చేందుకు వెన్నంటి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. భారీ ఆఫర్.. కేంద్ర తయారీ విధానం-2012 ప్రకారం ప్లాంటుపై పెట్టే పెట్టుబడిలో 25 శాతాన్ని కేంద్రం రిఫండ్ చేస్తుంది. జూలైతో ముగియనున్న ఈ స్కీంను కొన్నాళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని ఐసీఏ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. సీఎం వెంటనే స్పందించి ఈ మేరకు కేంద్రానికి లేఖను పంపాలని అధికారుల్ని కోరారు. హబ్ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమవుతాయని కంపెనీలు ప్రతిపాదించగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1,000 ఎకరాలు కేటాయించేందుకు సీఎం సిద్ధపడ్డారు. మొబైల్స్‌పై వ్యాట్ విషయంలో నెలకొన్న అస్పష్టతను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లగా 5 శాతానికే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చొరవ భేష్ అంటూ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు.