నెలకు 60 లక్షల మొబైల్స్ తయారీ
* రేణిగుంట మొబైల్స్ హబ్‌లో 8 కంపెనీలకు 122 ఎకరాలు
* భారత్‌లో హెడ్‌సెట్స్ తయారీ తొలి ప్లాంటు కూడా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తున్న మొబైల్స్ తయారీ హబ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 122 ఎకరాలు కేటాయించింది. సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ కంపెనీలు యాంకర్ యూనిట్లుగా ఈ హబ్ ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ హబ్‌లో యాంకర్ కంపెనీలన్నీ కలిపి నెలకు 60 లక్షల మొబైల్స్ తయారు చేయనున్నట్లు తెలిసింది.
మొబైల్ యాక్సెసరీస్ తయారీలో ఉన్న నాలుగు కంపెనీలు ఈ హబ్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. 8 కంపెనీలూ కలిసి రూ.2,000 కోట్ల దాకా పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. దీనిద్వారా నాలుగేళ్లలో 45,000 మందికి ఉపాధి లభించనుందని, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ హబ్ అభివృద్ధికి ఎకరాకు రూ.50 లక్షలు సమకూర్చనుందని తెలియవచ్చింది. దీనికి దసరా రోజున (22న) ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.
తొలిసారిగా హెడ్‌సెట్స్ తయారీ..
మొబైల్స్ హబ్‌లో గ్వాంగ్‌డాంగ్ వివ్‌టెక్ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో హెడ్‌సెట్స్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హెడ్‌సెట్స్ తయారీకి సంబంధించి ఇండియాలో తొలి ప్లాంటు ఇదే కావటం గమనార్హం. మొబైల్ హ్యాండ్‌సెట్లో వాడే స్పీకర్ల తయారీకి హుయిచెన్స్ అకౌస్టిక్స్ సంస్థ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యాక్సిమ్ సంస్థ చార్జర్ల తయారీ చేపడుతుంది. హబ్‌లో ఉన్న మొబైల్స్ కంపెనీలకు యాక్సెసరీస్‌ను సరఫరా చేస్తే వీటికి వ్యాట్ మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుతం యాక్సెసరీస్‌పై వ్యాట్ 14 శాతముంది. క్వాల్‌కామ్, మీడియాటెక్ వంటి కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇవి గనక ఈ హబ్‌లోనే ఏర్పాటైతే మొబైల్స్ కంపెనీలకు బాగా కలిసొస్తుంది.
ఆరు నెలల్లో తొలి ఉత్పాదన..
ఆరు నెలల్లో ఈ ప్లాంటు నుంచి తొలి ఉత్పాదనను బయటకు తెస్తామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. నెలకు 10 లక్షల ఫోన్లను తయారు చేస్తామన్నారు. ముందుగా ట్యాబ్లెట్లు తయారు చేస్తామని, ఫోన్లను రిలయన్స్ జియోకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తామని చెప్పారు. ‘ప్లాంటు కోసం 20 ఎకరాలు తీసుకుంటున్నాం. 200 కోట్లు పెట్టుబడి పెడతాం. హబ్‌లో ట్రైనింగ్ కేంద్రం, క్వాలిటీ కంట్రోల్ తోపాటు కామన్ ఫెసిలిటీలుంటాయి.
80 శాతం ఉపాధి అవకాశాలు టెన్త్, ఇంటర్ చదివినవారికే ఉంటాయి. పాలిటెక్నిక్ అభ్యర్థులకూ ఉద్యోగాలుంటాయి. వీరందరికీ ఇక్కడే శిక్షణ ఇస్తాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు చైనాలో శిక్షణ ఇప్పిస్తాం. హబ్ ఏర్పాటుతో చిత్తూరు, కడప, నెల్లూరు యువతకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని వివరించారు. అనుభవం లేకున్నా అభ్యర్థి సామర్థ్యాన్నిబట్టి వివిధ విభాగాల్లో విధులు అప్పగిస్తామన్నారు.
మెరుగైన పెట్టుబడి వాతావరణం: ఐసీఏ
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాతోపాటు ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌టీటీఎఫ్) ఏర్పాటుతో మొబైల్స్, విడిభాగాల తయారీలో పెట్టుబడుల వాతావరణం మెరుగైందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) వెల్లడించింది. దేశ, విదేశీ కంపెనీలు కొన్ని ఇప్పటికే భారత్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. మరిన్ని రానున్నాయని ఐసీఏ ప్రెసిడెంట్, ఎఫ్‌టీటీఎఫ్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. రేణిగుంటలో మొబైల్స్ తయారీ హబ్ ఏర్పాటుతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
2019 నాటికి భారత్‌లో రూ.3 లక్షల కోట్ల విలువైన 50 కోట్ల యూనిట్ల హ్యాండ్‌సెట్ల ఉత్పత్తి, 15 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌టీటీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో ఈ హబ్ ద్వారా 75,000 మందికి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. 2014-15తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ 110 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పంకజ్ వెల్లడించారు.